భాజపా కూడా రెండు లక్షలు ఇస్తుందిట!

April 09, 2018


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి తధ్యం. మేము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తాము. అంతే కాదు..ప్రతీ రైతు పొలంలో ఒక బోరుబావిని త్రవ్వించి ఇస్తాము,” అని హామీ ఇచ్చారు. 

గత ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు పంటరుణాలను మాఫీ చేస్తామని తెరాస హామీ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్, భాజపాలు ఎద్దేవా చేశాయి. తెలంగాణా ధనిక రాష్ట్రమైనప్పటికీ ఆ లక్ష రూపాయల రుణాన్ని ఒకేసారి మాఫీ చేయలేక నాలుగు వాయిదాలలో మాఫీ చేసింది. లక్ష రూపాయలు మాఫీ చేయడమే చాలా కష్టమని నిరూపితమైనప్పుడు కాంగ్రెస్, భాజపాలు ఇప్పుడు రెండు లక్షలు మాఫీ చేస్తామని చెపుతున్నాయి. అది కూడా ఒకేసారి మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. అది ఏవిధంగా సాధ్యమో ఉత్తమ్ కుమార్ రెడ్డే చెప్పాలి.

ఇక రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది బోరుబావులున్నాయి. వాటిలో 40 శాతం నీళ్ళు పడనివే. పడినా ఎండిపోయినవే. అయినప్పటికీ రైతులు నిత్యం బోరుబావులు తవ్విస్తూనే ఉన్నారు. దాని వలన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నప్పుడు బోరు బావుల త్రవ్వకాలపై ఆంక్షలు, నిషేధం విధించాలి. కానీ భాజపా అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు ఒక్కో బోరు బావి త్రవ్విస్తుందని లక్షణ్ హామీ ఇస్తున్నారు. అధికారం దక్కించుకోవడానికి ఇటువంటి హామీలు ఇవ్వడం సరికాదనే చెప్పాలి. 


Related Post