ధర్డ్ ఫ్రంట్ ఊసే లేదేమిటో?

April 07, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక రోజు హటాత్తుగా తాను ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. కోల్ కతా వెళ్ళి మమతా బెనర్జీని కలిసి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ కానీ తెరాస మంత్రులు గానీ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మాట్లాడటం మానుకోవడం గమనార్హం. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కెసిఆర్ ప్రకటించారు. కానీ రిజర్వేషన్ల అంశంపై లోక్ సభలో తెరాస ఎంపిలు అనుసరించిన వైఖరి వలన కెసిఆర్-మోడీ బంధంపై సహజంగానే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అదే ధర్డ్ ఫ్రంట్ విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా మార్చి ఉండవచ్చు. ధర్డ్ ఫ్రంట్ ప్రకటన చేసిన తరువాత లోక్ సభలో తెరాస ఎంపిలు చేయకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో? చివరి నిమిషంలో తెరాస ఎంపిలు ఆందోళన విరమించినప్పటికీ అప్పటికే కొంత డామేజి జరిగిపోయింది. 

నిజానికి కెసిఆర్ భాజపావైపు చూడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే, రాష్ట్రంలో భాజపా చాలా బలహీనంగా ఉంది కనుక భాజపాను తెరాస పెద్దగా పట్టించుకోనవసరంలేదు. ఇక మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ కూడా వచ్చేసింది కనుక ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయనే విషయంపై స్పష్టత వచ్చేసింది. నాలుగేళ్ళుగా నిధులు విడుదలవుతున్న తీరు చూసిన తరువాత రాష్ట్రానికి అధనంగా నిధులు వస్తాయనే నమ్మకం కూడా లేదు కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ మోడీకి విధేయంగా ఉండవలసిన అవసరం లేదు. కానీ తెరాస ఎంపిల హడావుడితో మోడీకి విధేయంగా ఉన్నట్లు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. కారణాలు ఏవైనప్పటికీ ఇప్పుడు ధర్డ్ ఫ్రంట్ ఊసు ఎత్తడం లేదు. దేశరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన కెసిఆర్ కు ఆశించినట్లుగా ఇతర రాష్ట్రాల పార్టీల మద్దతు లభించనందుకే వెనక్కు తగ్గారా? లేక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెరవెనుక ఏర్పాట్లు చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. 


Related Post