మంత్రి కేటిఆర్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య మళ్ళీ రాజకీయ సన్యాసాల సవాళ్లు, ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. మొన్న మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ “వచ్చే ఎన్నికలలో తెరాసయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. రాకపోతే నేను రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను. నాకు ఇంకా మరో 10-15 ఏళ్ళు రాజకీయాలలో ఉండేందుకు అవకాశం ఉంది. అయినా నేను ఈ సవాలుకు సిద్దం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించడానికి సిద్దమేనా?” అని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లాలో పరకాలకు చేరుకొన్నప్పుడు అక్కడ నిర్వహించిన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “కేటిఆర్ సవాలును నేను స్వీకరిస్తున్నాను. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఒకవేళ రాకపోతే నేను శాశ్వితంగా రాజకీయాలలో నుంచి తప్పుకొంటాను. మీడియా సాక్షిగా నేను ఈ మాట చెపుతున్నాను. కనుక కేటిఆర్ కూడా తన మాటకు కట్టుబడి ఉండాలి,” అని అన్నారు.
ఈ సవాళ్ళు వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమే కానీ ఈ జూదంలో వారిద్దరిలో ఎవరో ఒకరు ఓడిపోవడం ఖాయం కనుక వారిరువురూ నిజంగా తమ మాటకు కట్టుబడి ఉండేమాటయితే, ఎవరో ఒకరు రాజకీయ సన్యాసం చేయకతప్పనిసరి పరిస్థితి వారే కల్పించుకొన్నారు.
వారిద్దరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్గాకాలం రాజకీయాలలో ఉండి, అధికారం పదవులు అన్నీ అనుభవించి ఉన్నారు కనుక ఒకవేళ రాజకీయ సన్యాసం తీసుకోవలసి వచ్చినా ఆయనకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్ ఉన్న కేటిఆర్ ఈ వయసులోనే ఇటువంటి సవాళ్ళు విసరడం సరికాదనే చెప్పాలి.
వచ్చే ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్ పార్టీలతో పాటు భాజపా, తెదేపా, బిఎల్ఎఫ్, సిపిఐ, తెలంగాణా జనసమితి ఇంకా అనేకమంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీ పడతారు. తెరాసకు 106 సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ గట్టిగా చెపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజలు అన్ని పార్టీలను కాదని గంపగుత్తగా తెరాసకే ఓట్లేసి గెలిపిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. మరి అటువంటప్పుడు మంత్రి కేటిఆర్ రాజకీయ సన్యాసం సవాళ్ళు విసరడం రిస్క్ అవుతుంది కదా?