టి-కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏమంటారో?

April 07, 2018


img

శుక్రవారం పార్లమెంటు లాబీలో ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. తెరాస రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, కొత్తగా రాజ్యసభ సభ్యులుగా ఎంపికయిన జోగినిపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ లకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎదురయ్యారు. వారు ఆయనకు మర్యాదపూర్వకంగా నమస్కరించి తమను తాము పరిచయం చేసుకొన్నారు. వారిని అభినందించిన తరువాత తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్ళు మాత్రమే అయినా అన్ని రంగాలలో దూసుకుపోతోందని, ఇక ముందు కూడా ఇదేవిధంగా నిలకడగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. తెరాస ఎంపిలు అందరూ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా పెట్టుకొని పనిచేయాలని మన్మోహన్ సింగ్ సలహా ఇచ్చారు. తెరాస ఎంపిలు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని అయన సలహాను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోందని కే. కేశవరావు చెప్పారు.

ఇక్కడ రాష్ట్రంలో టి-కాంగ్రెస్ నేతలు తెరాస సర్కార్ హయంలో తెలంగాణా రాష్ట్రం అన్ని విధాల భ్రష్టు పట్టిపోతోందని, బారీగా అవినీతి జరుగుతోందని విమర్శలు చేస్తున్నారు. అందుకోసం వారు పనిగట్టుకొని బస్సుయాత్రలు కూడా చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత, మాజీ ప్రధాని, గొప్ప ఆర్ధికవేత్తగా గుర్తింపు కలిగిన డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణా రాష్ట్రం కేవలం మూడున్నరేళ్ళలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందని చెపుతున్నారు. అయన చెప్పింది వాస్తవమని అందరికీ తెలుసు. మరిప్పుడు టి-కాంగ్రెస్ నేతలు ఏమంటారో? అయన చెప్పింది సరికాదనగలరా?

రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రప్రభుత్వ అభిప్రాయం, రాష్ట్ర భాజపా నేతల వాదనలు కూడా ఇదేవిధంగా ఉండటం గమనార్హం. తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతోందని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, కేంద్రప్రభుత్వ అధికారులు మెచ్చుకొంటుంటే, రాష్ట్ర భాజపా నేతలు మాత్రం తెరాస సర్కార్ పాలన సరిగా లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే టి-కాంగ్రెస్, టి-భాజపాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయని భావించాలేమో? 


Related Post