మోడీజీ అదేం పని?

April 06, 2018


img

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ విడతలో 12 రోజులపాటు ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా ఎటువంటి చర్చలు జరుగకుండానే ఉభయసభలు ఈరోజు నుంచి నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఈ 12 రోజులలో ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళన చేస్తుంటే సభలోనే ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపలేదు. సభలో ఆర్డరులో లేదనే కుంటిసాకుతో స్పీకర్ సుమిత్రా మహాజన్ రోజూ సభను వాయిదా వేస్తూ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, తెరాస, అన్నాడిఎంకెలను అడ్డంపెట్టుకొని మోడీ సర్కార్ అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోకుండా తప్పించుకొంటున్నారని, అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోవడానికి నరేంద్ర మోడీ భయపడుతున్నారని ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు గుప్పిస్తున్నా సభలోనే ఉన్న మోడీ నోరు మెదపలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా దానినీ ఎదుర్కోవడానికి సిద్దపడలేదు. 

దేశభవిష్యత్ కు దిశానిర్దేశం చేసే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నిర్వహణ బాధ్యత కేంద్రానిదే. ప్రతిపక్షాలను నిందించి తప్పించుకోవడం సరికాదని రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పించారు. కనుక బడ్జెట్ సమావేశాలు జరుగకపోవడానికి ప్రతిపక్షాలది ఎంత తప్పో కేంద్రప్రభుత్వానిది అంతే తప్పని చెప్పకతప్పదు.

కానీ ప్రతిపక్షాలు చేసిన విమర్శలు, ఆరోపణలతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు భాజపాకు రాజకీయంగా చాలా నష్టం కలిగే ప్రమాదం ఉంది. బహుశః అందుకేనేమో..ప్రధాని నరేంద్ర మోడీ ఎవరూ ఊహించని ప్రతిపాదన చేశారు. శుక్రవారం జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ భాజపా ఎంపిలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మనం అందరినీ కలుపుకోవాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తూ పార్లమెంటు ప్రతిష్టకు భంగం కలిగించింది. అందుకు నిరసనగా అందరం ఏప్రిల్ 12న నిరాహార దీక్ష చేసి నిరసన తెలిజేద్దాము,” అని అన్నారు. 

వాస్తవానికి భాజపా, మోడీ సర్కార్ దేశప్రజల మద్య...పార్టీల మద్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, అవే విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ నిరాహార దీక్ష చేయాలని ప్రధాని మోడీ ప్రతిపాదించడం ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతోంది. కానీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరును దేశప్రజలందరూ నిశితంగా గమనించారు. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల సభ్యులు ఎవరు ఏవిధంగా ప్రవర్తించారో అందరూ కళ్ళారా చూశారు. కనుక వచ్చే ఎన్నికలలో వారు తగినవిధంగానే తీర్పు చెపుతారని భావించవచ్చు. 


Related Post