పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం కూడా అన్నాడిఎంకె సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడటంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఎటువంటి చర్చలు లేకుండానే నిరర్ధకంగా ముగిసిపోయాయి.
పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడగానే వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపిలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి తమ రాజీనామా పత్రాలను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చిన తమ రాజీనామాపత్రాలను తక్షణమే ఆమోదించాలని కోరారు. రాజీనామాలపై పునరాలోచించుకోవలసిందిగా ఆమె చేసిన విజ్ఞప్తిని వారు సున్నితంగా తిరస్కరించారు. మరికొద్ది సేపటిలో వారు ఏపి భవన్ చేరుకొని ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టబోతున్నారు.
తమ ఎంపిలు రాజీనామాలు చేయగానే, జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు సవాలు విసురుతూ “మేము చెప్పినట్లుగానే మా ఎంపిలు రాజీనామాలు చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం మొదలుపెడుతున్నారు. నేను ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు సవాలు విసురుతున్నాను. ఏపికి న్యాయంగా దక్కవలసిన ప్రత్యేకహోదా సాధించాలనుకొంటే, మీరు కూడా మీ ఎంపిల చేత రాజీనామాలు చేయించి మాతో చేతులు కలపాలి. అందరం కలిసి పోరాడి ప్రత్యేకహోదాను సాధించుకొందాము,” అని మెసేజ్ పెట్టారు.
వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసేశారు కనుక రాష్ట్రం కోసం తాము పదవులు త్యాగాలు చేశామని చెప్పుకొంటూ తెదేపాపై దాడి చేయడం మొదలుపెట్టారు కనుక తెదేపా నేతలు వారిపై ఎదురుదాడి చేయడం కూడా ఖాయమే. కనుక ఇక నుంచి ఏపిలో తెదేపా, వైకాపాల మద్య పెద్ద యుద్దమే మొదలవబోతోంది. అది వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతుంది.