కేంద్ర బడ్జెట్ లో ఏపికి అన్యాయం జరిగిందంటూ కేంద్రంపై తెదేపా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఏపిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. నేడు పార్లమెంటు సమావేశాలు ముగియగానే వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసి, డిల్లీలో ఏపి భవన్ లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. అటు ఏపిలో తెదేపా నేడు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్, బైక్ యాత్రలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ సైకిల్, బైక్ యాత్రలలో పాల్గొంటున్నారు.
ఏపికి అన్యాయం జరిగిందనే వాదనతో తెదేపా, వైకాపాలు పోటాపోటీగా దీక్షలు, యాత్రలు చేస్తున్నప్పటికీ, అవి రాజకీయంగా ఒకదానిపై మరొకటి పైచెయ్యి సాధించాలనే తాపత్రయంతోనే ఈ హడావుడి చేస్తున్నాయని అర్ధమవుతూనే ఉంది.
ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్న జగన్మోహన్ రెడ్డి తెదేపా సర్కార్ వైఫల్యాలను, అసమర్ధతను, అవినీతిని ఎండగడుతూ గత మూడున్నరేళ్ళుగా నిరంతర పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మరొక 9-12 నెలలోగా సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఇప్పుడు ప్రజలలో ప్రత్యేకహోదా సెంటిమెంటును రెచ్చగొట్టి తనవైపు తిప్పుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని తాపత్రయపడుతున్నారు. అందుకే రాజీనామాలు, దీక్షలు, భేరీలు, పాదయాత్రలు అంటూ హడావుడి చేస్తున్నారని తెదేపా నేతల వాదన.
చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళు భాజపాతో అంటకాగి ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఆఖరి సం.లో భాజపాతో, ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని కొత్త డ్రామా మొదలుపెట్టారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. కానీ వైకాపా కూడా అదే చేస్తోంది. అది కూడా ఎన్నికలు దగ్గర పడేవరకు తన ఎంపిలను పదవులలో కొనసాగనిచ్చి ఇప్పుడు రాజీనామాలు, దీక్షలు చేస్తోంది. కనుక రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాక ఆ పేరు చెప్పుకొని తమతమ పార్టీ ప్రయోజనాల కోసం, తమ ప్రత్యర్ధి పార్టీపై పైచెయ్యి సాధించడం కోసమే హడావుడి చేస్తున్నాయని చెప్పవచ్చు.
రెండు పార్టీలు ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నప్పటికీ అవి చేతులు కలపకుండా, దేనికవి పోరాటాలు చేస్తూ తమ ప్రత్యర్ధులపై దుమ్మెత్తిపోసుకొంటున్నాయి. కనుక అవి చేస్తున్న పోరాటాలను ఆధిపత్యపోరుగానే చూడాలి తప్ప వాటికి రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉందనుకోలేము. ఒకప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రెండు పార్టీలు ఏవిధంగా భూటకపు ఉద్యమాలు చేసి 2014ఎన్నికలలో ఏపి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించాయో ఇప్పుడూ అదేవిధంగా ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు పేరుతో ఉద్యమాలు చేసి ప్రజలను ఆకట్టుకొని అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాటికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని, విభజన హామీలను సాధించాలని నిజంగా తపన, చిత్తశుద్ధి ఉండి ఉంటే అవన్నీ ఎప్పుడో అమలయ్యి ఉండేవి.