నేటితో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసి ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడబోతున్నాయి. ఈ సమావేశాలను అవిశ్వాస తీర్మానాలు, సభ్యుల ఆందోళనలు హైజాక్ చేశాయని చెప్పక తప్పదు. ఆ కారణంగా 12 రోజులపాటు సమావేశాలు జరిగినా ప్రజాసమస్యలు, కేంద్ర బడ్జెట్, పలు బిల్లులపై ఎటువంటి చర్చ జరుగలేదు. ఈసారి అధికార ప్రతిపక్షాలన్నీ కలిసి పరమపవిత్రమైన పార్లమెంటును రాజకీయాలకు వేదికగా మార్చేసాయి.
రాష్ట్రాల సమస్యలను పార్లమెంటులో చర్చించాలని సభ్యులు నిజంగా కొరుకొంటున్నట్లయితే సభలో అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కానీ ఆందోళనలు చేసి సభ జరుగకుండా అడ్డుపడి కేంద్రప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా తప్పించుకొనేందుకు అవకాశం కల్పించారు. అయినప్పటికీ సభను నిర్వహించి సభ్యులు లేవనెత్తిన సమస్యలపై చర్చించవలసిన బాధ్యత కలిగిన కేంద్రప్రభుత్వం, సభ్యుల ఆందోళనల కారణంగా సభను నిర్వహించడంలేమని కుంటిసాకులు చెప్పి తప్పించుకొంది. ఈవిధంగా అధికార, ప్రతిపక్షా సభ్యులు అందరూ ప్రజాధనంతో ఆడుకొన్న రాజకీయ చదరంగంలో ఎవరు ఎవరిపై పైచెయ్యి సాధించారో తెలియదు కానీ అంతిమంగా దేశప్రజలే ఓడిపోయారని చెప్పక తప్పదు.