టి-కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలు చేస్తూ తెరాస సర్కార్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానానికి, టి కాంగ్రెస్ నేతలకు తెలంగాణా పట్ల, ప్రజల పట్ల ఎంత అభిమానం ఉంది? అని ప్రశ్నించుకోవలసి ఉంది.
తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు “తెలంగాణా నాయకులకు రాష్ట్రాన్ని పాలించుకోవడం చేతకాదు. తెలంగాణా ఇస్తే వారేమి చేసుకొంటారు? తెలంగాణా ఏర్పడితే రాష్ట్రంలో మావోయిస్టులు చెలరేగిపోతారు. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయి. రాష్ట్రం అంధకారం అయిపోతుంది. అభివృద్ధి స్తంభించిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నీళ్ళకోసం కొట్లాటలు జరుగుతాయి...”అంటూ చాలా అవహేళనగా మాట్లాడారు ఆనాటి ఆంధ్రాపాలకులు. కానీ వారు చెప్పిన దానికి భిన్నంగా కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే తెలంగాణా రాష్ట్రం దేశవిదేశాలలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొంది. అభివృద్ధి సంక్షేమ పధకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
కాంగ్రెస్ హయంలో రాజధాని హైదరాబాద్ లోనే విద్యుత్ కోతలు ఉండేవి. పరిశ్రమలకు వారానికి రెండు మూడు రోజులు చొప్పున విద్యుత్ కోతలు అమలుచేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి వారు పెట్టుకొన్న ముద్దుపేరు పవర్ హాలీడేస్! కానీ నేడు రాష్ట్రంలో రైతాంగానికి కూడా 24 గంటలు ఉచిత విద్యుత్ అందుతోంది.
ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకు “ఒక్క రూపాయి కూడా విదిలించను...ఏమి చేస్తారో చేసుకోండి” అని శాసనసభలోనే అహంకారంగా మాట్లాడినప్పుడు టి-కాంగ్రెస్ మంత్రులు, టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరెత్తలేకపోయారు. కానీ తెరాస సర్కార్ సాగునీటి ప్రాజెక్టులకు వేలకోట్లు కేటాయిస్తుంటే వారే ఇప్పుడు ప్రశ్నిస్తుండటం విడ్డూరంగా ఉంది.
తెలంగాణా ప్రసాదించమని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం తెలంగాణా ప్రజల పోరాటాలను అవమానించడమే. సుమారు 12 ఏళ్ళు ఏకధాటిగా పోరాటాలు చేసి, సుమారు 1,500 మంది యువకులు బలిదానాలు చేసుకొన్నాక అనివార్య పరిస్థితులలోనే తెలంగాణా ఇవ్వవలసివచ్చిందనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణా ప్రజలపై అంత ప్రేమ మమకారం ఉండి ఉంటే అన్నేళ్ళు ఎందుకు కాలయాపన చేసింది? అంతమందిని ఎందుకు బలితీసుకొంది?
చివరికి తెలంగాణా ఏర్పాటుకు అంగీకరించినప్పుడైన కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించలేదు. ఏవిధంగా తెలంగాణా ఏర్పాటు చేస్తే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎంత లాభం కలుగుతుందని లెక్కలు కట్టుకొని, ఒకసారి ‘రాయల తెలంగాణా’ ఒకసారి హైదరాబాద్ లేని తెలంగాణా అంటూ రకరకాల ప్రతిపాదనలు చేసినసంగతి అందరికీ తెలుసు. కనుక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అనుచితంగా, వివక్షపూరితంగానే ప్రవర్తించిందని చెప్పక తప్పదు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడేదో కొత్తగా ప్రేమ పుట్టుకువచ్చెసిందంటే నమ్మగలమా?