కెసిఆర్ వల్లే టిజెఎస్ ఆవిర్భావం!

April 03, 2018


img

ప్రొఫెసర్ కోదండరాం నిన్న తెలంగాణా జనసమితి (టిజెఎస్)పార్టీ పేరును ప్రకటిస్తూ, ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దేశ్యించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అయన నియంతృత్వ పోకడల కారణంగానే టిజెఎస్ ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణా కోసం పోరాడిన కెసిఆర్ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తారనుకొంటే, అయన నిరంకుశపాలన సాగిస్తూ ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచివేయిస్తున్నారని అన్నారు. మన ప్రజాస్వామ్యవ్యవస్థలో ఇటువంటి నియంతృత్వపోకడలను ఎవరూ హర్షించరని, కనుక కెసిఆర్ నియంతృత్వపాలనను అంతమొందించేందుకే టిజెఎస్ ఆవిర్భవించిందని అన్నారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగా అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. 

టిజెఎస్ ఆవిర్భావానికి కోదండరాం చెప్పిన కారణంతో సహా ఇంకా అనేక రాజకీయ కారణాలు ఉండవచ్చు. అయితే కెసిఆర్ వైఖరి వల్లే టిజెఎస్ ఆవిర్భవించిందన్న కోదండరాం మాటలు అక్షరాల నిజమని చెప్పవచ్చు. 

తెలంగాణా సాధన కోసం కెసిఆర్ ఏవిధంగా పోరాడారో, ప్రొఫెసర్ కోదండరాం కూడా అదేవిధంగా అదే స్థాయిలో పోరాడారు. కనుక తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత, తెలంగాణా శ్రేయోభిలాషి అయిన ప్రొఫెసర్ కోదండరాంకు సముచిత స్థానం కల్పించి గౌరవించి ఉండాలి. కానీ తెలంగాణా ఉద్యమాలకు అడ్డుపడిన వారిని రాజకీయ కారణాలతో అక్కున చేర్చుకొన్న కెసిఆర్, ప్రొఫెసర్ కోదండరాంను మాత్రం దూరంగా పెట్టారు. కనీసం అయనను సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని ఆయనతో మాట్లాడుతూ ఉంటే బాగుండేది. 

అయినా ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వ పరిస్థితి అర్ధం చేసుకొని అది నిలద్రొక్కుకోవడానికి రెండున్నరేళ్ళకుపైగా చాలా సంయమనం పాటించారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. అయన ‘తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కనుక అయన తెలంగాణా రాష్ట్రాన్ని, రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నట్లే’ అనే భావన వ్యాపింపజేయడానికి ప్రయత్నించారు. దానికోసం ఆయనపై ‘కాంగ్రెస్ ఏజంట్’ అనే ముద్ర వేయడానికి వెనుకాడలేదు. ఆ ముద్ర వేసినప్పటి నుంచి ఆయనను కూడా ఒక కాంగ్రెస్ నేత అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తూ కించపరిచే ప్రయత్నం చేశారు. తెలంగాణా సాధన కోసం పోరాడిన ఒక నాయకుడిని ఇంతగా అవమానపరచడానికి అయన చేసిన నేరం ఏమిటి? అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటమే.  

ఇవి కాక రైతులను కలవనీయకుండా ఆంక్షలు, పాదయాత్రలు, సభలు నిర్వహించుకోకుండా ఆంక్షలు, బలవంతపు గృహ నిర్భందాలు వంటివన్నీ ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేరు. కెసిఆర్ అంతటితో ఆగలేదు. తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రొఫెసర్ కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి తమను ఎదుర్కోవాలని సవాలు కూడా విసిరారు. ఈ కారణాలన్నీ తెలంగాణా జనసమితి ఆవిర్భావానికి దారి తీశాయని చెప్పక తప్పదు. కనుక టిజెఎస్ ఆవిర్భావానికి ప్రొఫెసర్ కోదండరాం ఎంత భాద్యులో కెసిఆర్ కూడా అంతే కారకులని చెప్పక తప్పదు 

ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ఏజంటా కాదా? తెలంగాణా జనసమితి కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కలిగిఉందా లేదా? అది ఎన్నికలలో గెలుస్తుందా లేదా? అనే విషయాలను పక్కన పెడితే, టిజెఎస్ వలన తెరాస ఓట్లు చీలడం ఖాయం కనుక తెరాసకు ఎంతో కొంత నష్టం కలగడం కూడా ఖాయమే. ఇది తెరాస చేజేతులా కొనితెచ్చుకొన్న సమస్యే కనుక ప్రొఫెసర్ కోదండరాంను నిందించడం అనవసరం.


Related Post