చంద్రబాబు డిల్లీకి వెళ్తే వారికెందుకు ఆందోళన?

April 02, 2018


img

టి-కాంగ్రెస్ నేతలు తుమ్మాలన్నా దగ్గాలన్నా అధిష్టానం అనుమతి కోసం డిల్లీ వెళ్ళివస్తుంటారు. అది చాలా సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. కనుక వారు ఎన్నిసార్లు డిల్లీ వెళ్ళివచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు, చంద్రబాబు, కెసిఆర్, ప్రధాన ప్రతిపక్షనేత జగన్ డిల్లీ వెళితే ఊహాగానాలు మొదలైపోతాయి. వారు తమ కేసుల నుంచి బయటపడేందుకే డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని ఆరోపించడం పరిపాటయిపోయింది. అదేదో రెడ్ లైట్ ఏరియా అన్నట్లు డిల్లీకి వెళ్ళేవారిని అనుమానంగా చూడటం నేతలకు పరిపాటయిపోయింది. 

ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి అంటే ఏప్రిల్ 3,4 తేదీలలో డిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలువబోతున్నారు. షరా మామూలుగా వైకాపా నేతలు ‘కేసుల మాఫీ పాట’ పాడిన తరువాత, అయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాక తన స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే డిల్లీ వెళుతున్నారని ఆరోపణలు మొదలుపెట్టేశారు. 

అయితే తాను ఏపికి జరిగిన అన్యాయం గురించి ప్రతిపక్ష నేతలకు చెప్పుకోవడానికే డిల్లీ వెళుతున్నానని బాబు చెప్పుకొంటున్నారు. 

ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైకాపా ఎంపిలు రాజీనామాలు చేసి ఏపి భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దపడుతున్నారు. దీనికి మంచి హైప్ సృష్టించి ఆ వేడిని మెల్లగా ఏపికి వ్యాపింపజేయలనుకొంటున్నారని వారి మాటలతోనే అర్ధమవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు డిల్లీలో దిగి హడావుడి చేస్తే సహజంగానే మీడియా దృష్టి ఆయనపైకి మళ్ళుతుంది. వారు చేస్తున్న ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికే బాబు డిల్లీ పర్యటన పెట్టుకొని ఉండవచ్చు. బహుశః అందుకే వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నట్లున్నారు. కనుక షరా మామూలుగా ‘బాబు కూడా కేసుల నుంచి బయటపడటం కోసమే డిల్లీ వస్తున్నారనే పాత పాటను అందరూ కోరస్ గా పాడుతున్నారనుకోవచ్చు. అయితే బాబు విషయంలో వారి భయాలు, అనుమానాలను కూడా కొట్టిపారేయలేము. ఒకవేళ బాబు డిల్లీలో చక్రం తిప్పితే అప్పుడు వైకాపాకు వ్రతం చెడినా ఫలం దక్కనట్లవుతుంది. కనుక ఎవరి పావులు వారు కదుపుతున్నారు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు గెలుస్తారో చూడాలి. 


Related Post