ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభం అయింది. ఒకప్పుడు విద్యుత్ సరఫరా లేక అల్లాడిపోయిన రైతులకు అది వరంగా మారాలి కానీ అదే వారి పాలిట శాపంగా మారుతోందని ఈ కధనాలు స్పష్టం చేస్తాయి.
24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా మొదలైనప్పుడు రాష్ట్రంలో రైతులందరూ చాలా సంతోషించిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు వారే ‘ఉచిత విద్యుత్ భాదితులు’గా మారడం విచిత్రం. 24 గంటలు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉండటంతో చాలా మంది రైతులు బోరుబావుల నుంచి అవసరానికి మించి నీటిని తోడటం మొదలుపెట్టడంతో ఇంకా వేసవి కాలం మొదలవక మునుపే చాలా జిల్లాలలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఆ జాబితాలో కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలు ముందున్నాయి.
కరీంనగర్ రామగుండం పరిధిలోగల వెలిచల గ్రామంలో భూగర్భజలాలు అడుగంటిపోవడంతో అక్కడి రైతులు తమ పంటలను కాపాడుకోవడం కోసం ట్యాంకర్లతో నీటిని రప్పించుకొంటున్నారు. వెలిచల, దాని సమీపంలో గల గూడేలపల్లి, కిస్త్రాంపల్లి గ్రామాలలో సుమారు 500 ఎకరాలలో వరి, మొక్కజొన్న పంటలు వేశారు. ఆ గ్రామాలకు సమీపంలోనే మిషన్ కాకతీయ పధకంలో భాగంగా ఐదు పెద్ద, రెండు చిన్న చెరువులలో పూడిక తీయబడ్డాయి. కానీ వాటిలో నీరు లేకపోవడంతో కలుపుమొక్కలు పెరిగిపోయాయి.
అటు చెరువులలో, ఇటు బోరు బావులలో నీళ్ళు ఇంకిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కో రైతు ప్రతీరోజూ రూ.500 చెల్లించి నీళ్ళ ట్యాంకర్లను తెప్పించుకొని పొలాలకు పెడుతున్నారు. ఈ నీళ్ళు ఒక ఎకరం అంతకంటే తక్కువ ఉన్న వాటికి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మరిన్ని ట్యాంకర్లు పడతాయి. రోజుకొక నీళ్ళ ట్యాంకర్ చొప్పున ఒక్కో రైతు నెలకి రూ.15,000 ఖర్చు పెడుతున్నారు!
నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలలో రైతుల పరిస్థితి కూడా అంతే. నిజాం సాగర్ ఆయకట్టు క్రింద సాగవుతున్న పంటలకు పెద్దగా నీటి ఇబ్బంది లేదు కానీ జిల్లాలో ఇతర మండలాలలో భూగర్భజలాలు అడుగంటాయని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ చెప్పారు.
కామారెడ్డిలో గల 22 మండలాలున్నాయి. వాటిలో 10 మండలాలలో భూగర్భజలాలు అప్పుడే అడుగంటిపోయాయి. మిగిలిన మండలాలలో కూడా నేడో రేపో అడుగంటిపోవచ్చు. లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, మాచరెడ్డి, రామరెడ్డి మొదలైన గ్రామాలలో నీళ్ళు లేకపోవడంతో రైతులు తమ పొలాలలోకి పశువులను వదులుతున్నారు. మరికొంతమంది వరి మొక్కలను పశుగ్రాసంగా అమ్ముకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని మండలాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
తమ పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలు ఉచిత విద్యుత్ పధకం మొదలైన 3 నెలలలోనే ఈ దుస్థితి నెలకొంది. మున్ముందు ఇంకెంత భయంకరంగా ఉండబోతున్నాయో ఎవరూ ఊహించలేము. నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతే ఇక రైతులకు విద్యుత్ అవసరం కూడా ఉండకపోవచ్చు.