అయితే కాగ్ ఎందుకు?

April 02, 2018


img

ప్రతీ రాష్ట్రంలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న పనులను నిశితంగా పరిశీలించి, వాటిలో జరుగుతున్న తప్పొప్పులను ఎత్తి చూపి ప్రభుత్వాలను అప్రమత్తం చేసి ఆ తప్పులు పునరావృతం కాకుండా నివారించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినది కాగ్. ఈసారి అది తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్ర బడ్జెట్ పై దృష్టి సారించి అనే తప్పులను ఎత్తి చూపించింది. అయితే ప్రభుత్వాన్ని తప్పు పట్టే అధికారం కాగ్ కు లేదని మంత్రి కేటిఆర్ అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందనే తమ ఆరోపణలు నిజమని కాగ్ నివేదిక నిరూపించిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తెరాస సర్కార్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తునందున కాగ్ నివేదిక ఆధారంగా హైకోర్టులో పిటిషన్ వేస్తామని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

దానికి మంత్రి హరీష్ రావు ఘాటుగా సమాధానం చెప్పారు.  వైఎస్ హయంలో జరిగిన అక్రమాలను కాగ్ బయట పెట్టినప్పుడు కాగ్ నివేదిక అంటే భగవద్గీత, బైబిల్ కాదని వాదించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దానినే ప్రామాణికంగా తీసుకోవాలని ఎలా చెపుతున్నారని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు మరొకరకంగా మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. 

వివిధ రంగాలకు చెందిన నిపుణులు అధ్యయనం చేసి కాగ్ నివేదికను తయారుచేస్తుంటారు. కనుక దానిని ఖచ్చితమైనదేనని చెప్పవచ్చు. కానీ తమ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, అనేక లోటుపాట్లు ఉన్నాయని అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా అంగీకరించదు. కాగ్ నివేదికలో తమ ప్రభుత్వం గురించి మెచ్చుకొనే విషయాలుంటేనే స్వీకరించి దాని గురించి స్వంత డబ్బా వాయించుకొంటాయి. వాటిని యధార్ధమని నమ్మి స్వీకరిస్తున్న ప్రభుత్వాలు, దానిలోనే పేర్కొన్న లోటుపాట్లను మాత్రం స్వీకరించడానికి ఇష్టపడవు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు తెరాస కూడా అదే చేస్తోంది. 

కాగ్ నివేదికలో ఎత్తి చూపిన లోపాలను అధికార పార్టీలు అంగీకరించకపోయినా పరువాలేదు. కానీ దానిలో పేర్కొన్న లోటుపాట్లను సవరించుకొనే ప్రయత్నం తప్పక చేయాలి. లేకుంటే కాగ్ శ్రమ, దాని నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్న ప్రజాధనం అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. 


Related Post