భాజపాకు మరో అగ్నిపరీక్ష

April 02, 2018


img

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పార్లమెంటులో వరుసగా అవిశ్వాస తీర్మానాలు...మిత్రపక్షాలు తెదేపా, శివసేనల నిందలు. కాంగ్రెస్ మిత్రపక్షాల విమర్శలు.. ఈ నేపధ్యంలో భాజపా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఇంతకాలం మహారాష్ట్రలో భాజపాకు మిత్రపక్షంగా, భాజపా సర్కార్ లో భాగస్వామిగా ఉన్న శివసేన భాజపాకు మరో పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్దం అవుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి బలం ఉన్న 50-55స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆదివారం ప్రకటించారు. 

కర్ణాటక రాష్ట్రాన్ని భాజపా సుమారు రెండు దశాబ్దాలపాటు పరిపాలించింది. ఆ రాష్ట్రంలో హిందుత్వవాదం బలంగా ఉంది కనుకనే అది సాధ్యపడింది. అదేవిధంగా, శ్రీరాంసేన వంటి కరడుగట్టిన హిందుత్వవాదుల మద్దతు కూడా ఉంది. శివసేన కూడా హిందుత్వవాదం, హిందుత్వవాదులపైనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటుంది. కనుక దాని వలన భాజపాకు ఎంత రాజకీయ అవకాశం ఉందో శివసేనకు కూడా అంతే ఉంటుంది. పైగా కర్నాటక మహారాష్ట్రతో సరిహద్దు పంచుకొంటోంది కనుక సరిహద్దు ప్రాంతాలలో మరాఠీలు అధికంగానే ఉంటారు. అదికూడా శివసేనకు కలిసివస్తుంది. కనుక ఈ పరిస్థితులను వినియోగించుకొని కర్నాటక రాష్ట్రానికి కూడా శివసేనను విస్తరించాలని భావించడం సహజం. 

శివసేన ఎంట్రీతో భాజపా ఓట్లే చీలిపోతాయి కనుక దాని విజయావకాశాలు తగ్గినట్లే చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో గెలిచి దక్షిణాది రాష్ట్రాలలో  కూడా తన సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్న భాజపాకు మిత్రపక్షం శివసేన నిర్ణయం పెద్ద షాక్ వంటిదేనని చెప్పవచ్చు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో శివసేన ఎంట్రీతో పార్టీల బలాబలాలు మారవచ్చు. ఆ ప్రభావం ఎన్నికలలో తప్పకుండా కనిపించవచ్చు.


Related Post