కెసిఆర్, కోదండరాం ప్రయత్నాలు ఫలించేనా?

April 02, 2018


img

వచ్చే ఎన్నికలలో మోడీ సర్కార్ ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ స్థాపించాలనుకొంటున్నారు. కెసిఆర్ సర్కార్ ను గద్దె దించి రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు సాధించేందుకు సిపిఎం నేతృత్వంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటయింది. ఇంచుమించు అవే ఉద్దేశ్యాలు, లక్ష్యాలతో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణా జన సమితి (టిజెఎస్) ఏర్పాటవుతోంది. ఇక టి-కాంగ్రెస్ వాదనలు, లక్ష్యం కూడా అదే.

రాష్ట్రంలో కెసిఆర్ సర్కార్ ను గద్దె దింపి అధికారంలోకి రావడమే లక్ష్యంగా టి-కాంగ్రెస్ పనిచేస్తున్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో లేదా దానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్న మమతా బెనర్జీవంటి వారితో కెసిఆర్ చేతులు కలిపితే అది అనైతిక రాజకీయమే అవుతుంది. అటువంటి అనైతిక పునాదుల మీద నిర్మించబడే ధర్డ్ ఫ్రంట్ జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు ఏవిధంగా సాధించగలదు?

ఇక కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ భాజపాకు టీమ్-బి వంటిదని ప్రతిపక్షాలు వాదిస్తుంటే, రాష్ట్రంలో కోదండరాం స్థాపించబోతున్న తెలంగాణా జన సమితి (టిజెఎస్) టి-కాంగ్రెస్ కు టీమ్-బి వంటిదని తెరాస వాదిస్తోంది. 

కోదండరాంకు కాంగ్రెస్ నేతలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయని అందరికీ తెలుసు. తెరాస సర్కార్ అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ, దానిని గద్దె దించాలనే లక్ష్యంతోనే టిజెఎస్, బిఎల్ఎఫ్ ఏర్పాటయినప్పటికీ, బిఎల్ఎఫ్ లో చేరడానికి కోదండరాం సంకోచించడమే తెరాస ఆరోపణలను దృవీకరిస్తోంది. 

కాంగ్రెస్, భాజపాల పాలన బాగోలేదని కెసిఆర్ వాదిస్తుంటే, మోడీ, కెసిఆర్ పాలన బాగోలేదని కాంగ్రెస్, కోదండరాం, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కాంగ్రెస్ ఆశ. కేటిఆర్ ను తెలంగాణా ముఖ్యమంత్రిగా చేయాలని కెసిఆర్ ఆశ. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని టి-కాంగ్రెస్ ఆశ. అంటే ఎవరి పాలనా బాగోలేదనుకోవాలా? లేక అన్ని పార్టీలు అధికారం కోసమే  తాపత్రయపడుతూ ఈవిధంగా రాజకీయాలు చేస్తున్నాయనుకోవాలా? అంటే అన్ని పార్టీలు పైకి చెపుతున్న కారణాలతో గాక రాజకీయ కారణాలతోనే పార్టీలను, కూటములను ఏర్పాటుచేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.  

అధికార కాంక్షతో, రాజకీయ ఉద్దేశ్యాలతో ఏర్పడుతున్న ఈ పార్టీలు, కూటములు రాష్ట్రంలో, దేశంలో మార్పు తీసుకువస్తాయంటే నమ్మశక్యంగా లేదు కానీ నమ్మక తప్పని పరిస్థితి. కనుక రాబోయే ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్నిపరీక్ష, దేశ ప్రజల విజ్ఞతకు పరీక్షగా నిలువబోతున్నాయని చెప్పకతప్పదు.  


Related Post