కాంగ్రెస్ థర్డ్ క్లాస్..మల్లు రియాక్షన్

March 31, 2018


img

కాంగ్రెస్ పార్టీ ఒక థర్డ్ క్లాస్ పార్టీ అని, దానిలో నెహ్రు మొదలు రాహుల్ గాంధీ వరకు వంశపారంపర్య పాలన సాగుతోందని మంత్రి కేటిఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై టి-పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చాలా ఘాటుగా స్పందించారు. 

శనివారం అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “కేటిఆర్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో దేశప్రజలందరికీ తెలుసు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయే. నెహ్రూ మొదలు మన్మోహన్ సింగ్ వరకు ఎవరి మంత్రివర్గంలో కూడా వారి వారసులు పదవులు అనుభవించలేదు. వివిధ కారణాల చేత ఒకరి తరువాతే మరొకరు భాద్యతలు చేపట్టారు తప్ప కెసిఆర్ కుటుంబంలోలాగ ఒకే కుటుంబం నుంచి నలుగురు పదవులు పంచుకోలేదు. 

దేశానికి స్వాతంత్ర్యం సంపాదించేందుకు నెహ్రూ జైలుకు వెళ్ళిన సంగతి మంత్రి కేటిఆర్ కు తెలియదేమో? అలాగే దేశం కోసం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల బలిదానాలు, సోనియా గాంధీ పదవీ త్యాగం కేటిఆర్ కు తెలియకనే మా పార్టీని ఉద్దేశ్యించి అంత నీచంగా మాట్లాడారా? పదేళ్ళు యూపియే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ అయన అత్యున్నతమైన ఆ పదవి కోసం ఆరాటపడలేదు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీతో తెరాస ఏనాటికైనా సరి తూగగలదా? 

తెరాస సర్కార్ గురించి మేము చెప్పక్కరలేదు కాగ్  నివేదికే చెప్పింది. కేవలం మూడున్నరేళ్ళలోనే మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత తెరాస సర్కార్ ది. హడ్కో నుంచి అప్పులు తెచ్చిన డబ్బును ఆదాయంగా చూపడం దానికే చెల్లు. అవసరం లేకపోయినా అధికధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు కాగ్ నివేదికలో చెప్పింది. కాగ్ నివేదికపై మేము ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే మా అందరినీ సమావేశాలు మొదలవక మునుపే సస్పెండ్ చేసి, ఒక దుస్సంప్రదాయానికి నాంది పలికింది. తెరాస సర్కార్ గురించి ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా పరువాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి చులకనగా మాట్లాడితే ఊరుకోము,” అని మల్లు భట్టి విక్రమార్క మంత్రి కేటిఆర్ ను గట్టిగా హెచ్చరించారు.


Related Post