కుటుంబపాలన మీతోనే మొదలైంది: కేటిఆర్

March 31, 2018


img

వనపర్తి జిల్లాలో మదనాపురం మండల కేంద్రంలో శుక్రవారం తెరాస బహిరంగసభ జరిగింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్   దానిలో మాట్లాడుతూ టి-కాంగ్రెస్ నేతల విమర్శలకు ఘాటుగా అబడులిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే కుటుంబపాలన సాగిస్తుంటే, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెరాస సర్కార్ లో కుటుంబపాలన సాగుతోందని విమర్శించడం సిగ్గుచేటని మంత్రి కేటిఆర్ అన్నారు. తన ఇంట్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలున్నారన్న సంగతి గుర్తులేన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము కాంగ్రెస్ నేతలాగ అధికారాన్ని వంశపారంపర్య హక్కుగా భావించడంలేదని, తెలంగాణా ఉద్యమాలలో పాల్గొని కేసులు ఎదుర్కొని, ఆ తరువాత ఎన్నికలలో పోటీచేసి గెలిచి అధికారంలోకి వచ్చాము తప్ప దొడ్డిదారిన రాలేదన్నారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని, దేశాన్ని అన్నివిధాలుగా భ్రష్టు పట్టించేసి, ఇప్పుడు తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కూడా అడ్డుపడుతున్నారని కేటిఆర్ విమర్శించారు. పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పాలమూరుకు నీళ్ళు పారించి సస్యశ్యామలం చేస్తున్నామని అన్నారు. 

మన దేశ రాజకీయాలలో కుటుంబపాలన గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది. ఎందుకంటే జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో చివరికి జిల్లా, మండల స్థాయిలో కూడా పదవులు, అధికారం అన్నీ వంశపారంపర్యంగానే సాగుతున్నాయి. సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకొంటుంటే, కేటిఆర్ ను తెలంగాణా ముఖ్యమంత్రి చేయాలని కెసిఆర్, ఏపిలో నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు అనుకొంటున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలలోను ఇదే పరిస్థితి నెలకొని ఉంది.   

వచ్చే ఎన్నికలలో తమ కొడుకులు, అల్లుళ్ళు, సమీప బంధువులలో ఎవరెవరికి టికెట్లు ఇప్పించుకోవాలో కాంగ్రెస్ నేతలు అప్పుడే లెక్కలు చూసుకొంటున్న సంగతి రోజూ వింటూనే ఉన్నాము. దాదాపు అన్ని పార్టీలలో అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులు తమ వారసులకు టికెట్లు, పదవులు అధికారం ఇప్పించుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవి కాకపోతే ప్రభుత్వ కాంట్రాక్టులు వగైరా ఇప్పించుకొంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక కుటుంబపాలనకు ఏ పార్టీ అతీతమని చెప్పలేము. 


Related Post