బాబు వ్యూహం ఏమిటో?

March 30, 2018


img

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు భాజపాతో, ఎన్డీయే ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకొని మోడీ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన తరువాత మొదటిసారిగా ఏప్రిల్ 2,3 తేదీలలో డిల్లీ పర్యటనకు వెళ్తానని చెప్పారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నపుడే నాకు ప్రధాని మోడీ అపాయింట్మెంటు ఇవ్వలేదని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కనుక ఈ నేపధ్యంలో ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇక తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తిలేదని బాబు స్వయంగా చెపుతున్నారు కనుక పనికట్టుకొని డిల్లీ వెళ్ళి ప్రతిపక్ష నేతలను కలువవలసిన అవసరం లేదు. మరి డిల్లీ ఎందుకు వెళుతున్నారు? అనే సందేహం కలుగకమానదు. 

కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ పై తెదేపా ఇంతవరకు స్పందించలేదు. అలాగే జాతీయస్థాయిలో మంచి పరిచయాలున్న చంద్రబాబును పట్టించుకోకుండా కెసిఆర్ ఎవరెవరినో కలుస్తున్నారు. అంటే ఆయనకు కూడా బాబుతో కలిసి పనిచేయాలని ఆసక్తిలేదని స్పష్టం అవుతోంది. కనుక ధర్డ్ ఫ్రంట్ కు మద్దతుగా పార్టీలను కూడగట్టడానికి చంద్రబాబు డిల్లీ వెళుతున్నట్లు భావించలేము. అయితే మరి డిల్లీ దేనికి వెళుతున్నారు? అంటే ఏపి రాష్ట్ర రాజకీయాలలో వైకాపాతో జరుగుతున్న ఆధిపత్యపోరులో పైచెయ్యి సాధించడానికేనని చెప్పడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

భాజపా-తెదేపా తెగతెంపులు చేసుకోగానే భాజపా-వైకాపాలు దగ్గరయ్యాయి. కనుక చంద్రబాబు ఏపిలో కొత్త స్నేహితుడిని వెతుక్కోవలసి ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అయితే ఆశ్చర్యం లేదు. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తానని కాంగ్రెస్ చెపుతోంది. అది వస్తుందో రాదో...వచ్చినా ఇస్తుందో లేదో.. ఎవరికీ తెలియదు కానీ ఆ హామీతో దానితో దోస్తీ చేసి రెండూ కలిసి ప్రజల ముందుకు వెళ్ళవచ్చు. అప్పుడు భాజపాను...దానితో జత కట్టిన వైకాపాను ఎదుర్కోవడం సులువు అవుతుంది.    

కాంగ్రెస్ పార్టీలో ఎలాగూ రేవంత్ రెడ్డి ఉన్నాడు. అలాగే తెదేపాలో అనేకమంది కాంగ్రెస్ నేతలున్నారు. ఇక తెలంగాణాలో విజయావకాశాలున్న కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి తెదేపా నేతలు అభ్యంతరం చెప్పరు. ఏపిలో దాదాపు అదృశ్యమైన కాంగ్రెస్ పార్టీకి తెదేపా మళ్ళీ జీవం పోస్తానంటే కాంగ్రెస్ నేతలు వద్దనరు. భాజపాకు ఇచ్చిన సీట్లు ఏవో వారికే ఇస్తే వారూ సంతోషిస్తారు. 

ఇక వచ్చే ఎన్నికలలో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. జాతీయస్థాయి రాజకీయ నేతలలో మంచి పరిచయాలున్న చంద్రబాబుతో చేతులు కలిపితే అయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టగలరు. సమస్యలను అవకాశాలుగా మలుచుకొని పైకి ఎదుగుతానని చంద్రబాబు చెపుతుంటారు. కనుక రాష్ట్రంలో తన పార్టీకి ఏర్పడిన ప్రమాదపరిస్థితులను అధిగమించేందుకు అయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్దపడినా ఆశ్చర్యం లేదు. బహుశః అందుకే డిల్లీ వెళుతున్నారేమో? ఏమో? 


Related Post