దుర్యోధుని సభలా బడ్జెట్ సమావేశాలు: దాసోజు

March 30, 2018


img

టి-కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెరాస సర్కార్ తీరును ఆక్షేపిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ప్రతిపక్షపార్టీని బయటకు పంపించేసి బడ్జెట్ సమావేశాలను దుర్యోధనుడి సభలా నిర్వహించారు. సభలో ప్రశ్నించేవారు లేకుండా చేసుకొని, ప్రజా సమస్యలపై ఎటువంటి చర్చలు చేయకుండా పోటీలు పడి స్వంత డప్పుకొట్టుకొంటూ కాలక్షేపం చేసేశారు. ప్రశ్నించేవారు వారే..జవాబులు చెప్పుకొనేవారు వారే. ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకుండానే కీలకమైన బడ్జెట్ సమావేశాలు ‘మమ’ అనిపించేశారు. ఈవిధంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించినందుకు సిగ్గుపడకపోగా అదేదో ఘనకార్యం చేసినట్లు 11 బిల్లులపై చర్చించామని చెప్పుకోవడం సిగ్గుచేటు,” అని విమర్శించారు.

నిజానికి తెరాస సర్కార్ కు ఆ అవకాశం కల్పించింది కాంగ్రెస్ నేతలే అని చెప్పక తప్పదు. శాసనసభలో తెరాస సర్కార్ ను నిలదీస్తామని, దాని ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని ప్రజల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు, తీరాచేసి శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలవగానే గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు నానా రభస చేసి సస్పెండ్ అయ్యారు. 

సమావేశాలు ప్రారంభం కాకమునుపే వారు ఆవిధంగా చెలరేగిపోవడంపై అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. వారు బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఆవిధంగా వ్యవహరించి సస్పెన్షన్ వేటు వేయించుకొని బయటపడ్డారనే విమర్శలను వారు పట్టించుకోవడం లేదు. ఈ సమావేశాలకు హాజరయితే, వారిలో ఎవరెవరు ఏ ఏ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కోర్టులలో పిటిషన్లు వేయించారు?ఈ పనిమీద డిల్లీలో ఎవరెవరిని కలిశారు? ఎంత ఖర్చు చేశారు? వంటి వివరాలన్నిటినీ బయటపెడతామని మంత్రి హరీష్ రావు ముందే హెచ్చరించారు. బహుశః ఆ భయంతోనే వారు సస్పెన్షన్ వేటు వేయించుకొని తప్పించుకొన్నారేమో? ఏమో? 


Related Post