ధర్డ్ ఫ్రంట్ కు కాంగ్రెస్ పార్టీయే అడ్డుగోడ?

March 30, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన ప్రదానోదేశ్యం జాతీయస్థాయిలో కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటుచేయడం. కానీ అయన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అవరోధంగా మారడం విశేషం. అయన దేశంలో కాంగ్రెస్, భాజపాయేతార పార్టీలను అన్నిటినీ కూడగట్టి ఫ్రంట్ ఏర్పాటు చేద్దామనుకొంటే, వాటన్నిటినీ తన నేతృత్వంలో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ కు అవరోధంగా మారాయి. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనపట్ల సానుకూలంగా స్పందించినప్పటికీ, కొత్తగా ఏర్పాటు చేసే ధర్డ్ ఫ్రంట్ లో చేరడంకంటే బలమైన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పనిచేయడం ద్వారానే మోడీని, భాజపాను ఎదుర్కొని ఓడించవచ్చని సోనియా గాంధీ, శరత్ పవార్ తదితరులు ఆమెకు సూచిస్తున్నారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి, ప్రతీ రాష్ట్రంలో భాజపాను డ్డీకొన్నప్పుడే దానిని ఓడించడం సాధ్యమని, ఎవరికీ వారుగా భాజపాను డ్డీకొంటే భాజపాకే లబ్ది కలుగుతుందని వారు గట్టిగా నొక్కి చెపుతున్నారు. 

కెసిఆర్ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొన్నారో అదే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాదనలు, ప్రయత్నాలతో అయన ప్రయత్నాలకు గండి కొడుతుండటం ఆశ్చర్యకరమే. యూపి, ఎంపి, రాజస్థాన్, బిహార్, డిల్లీ, పంజాబ్ వంటి హిందీ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా తమకు బాగా పరిచయమున్న కాంగ్రెస్ పార్టీవైపే ఎక్కువ మొగ్గు చూపుతాయి తప్ప కెసిఆర్ ఎంత సమర్ధుడైనప్పటికీ అయన దక్షిణాది నేత అయినందున అయన నేతృత్వంలో పనిచేయడానికి ఇష్టపడతాయనుకోలేము. 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పనిచేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేని మమతా బెనర్జీ వంటి కొందరు నేతలు కెసిఆర్ తో చేతులు కలిపి ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లయితే దానికి కాంగ్రెస్ పార్టీతో లోపాయికారీ అవగాహన కలిగి ఉందనే అనుమానాలు దాని విశ్వసనీయతను దెబ్బ తీస్తాయి. 

జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పులు సాధించాలని కెసిఆర్ నిజంగా కోరుకొంటున్నట్లయితే తను ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలనే భాగస్వాములుగా చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే దానికి విశ్వసనీయత ఏర్పడుతుంది. కానీ వర్తమాన రాజకీయాలలో క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలున్నారా? అంటే అనుమానమే. 

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. అయన తండ్రి ఒక హత్య కేసులో జైలుకు వెళ్ళివచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం రతన్ టాటా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నానో కార్ల తయారీ సంస్థను ఏర్పాటుచేస్తుంటే, మమతా బెనర్జీ దానిని అక్కడి నుంచి తరిమికొట్టేవరకు నిద్రపోలేదు. ఆమె ఒకపక్క కెసిఆర్ తో మరోపక్క సోనియా గాంధీతో సంప్రదింపులు జరుపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఇటువంటి నేతలతో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేస్తే దానికి ఏమి విశ్వసనీయత ఉంటుంది? విశ్వసనీయతలేని ధర్డ్ ఫ్రంట్ ను ప్రజలు ఆదరిస్తారా? అటువంటి నేతలతో కూడిన ధర్డ్ ఫ్రంట్ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కెసిఆర్ చెపుతున్న గుణాత్మకమైన మార్పు సాధించడం సాధ్యమేనా?


Related Post