తెదేపా 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ నేతలు గరికపాటి మోహన్ రావు, సండ్ర వెంకట వీరయ్య, పెద్దిరెడ్డి, రవీంద్ర కుమార్, వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నపూర్ణమ్మ, జె. ఇందిరా, అజ్మీరా రాజు నాయక్ తదిరరులు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెదేపా, దాని వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గొప్పదనం గురించి మాట్లాడి, తెలంగాణాలో తెదేపా మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తుందని ఎల్ రమణ అన్నారు.
తెలంగాణా తెదేపా నేతల తీరు ‘మా తాతలు నేతులు తాగారు..మా మూతుల వాసన చూడండి’ అన్నట్లుంది. తెదేపా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మాట నిజమే. ప్రస్తుతం ఏపిలో తెదేపాయే అధికారంలో ఉన్న మాట కూడా నిజమే! కానీ తెలంగాణాలో తెదేపా పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఒక్కో నేత పార్టీని విడిచి వెళ్ళిపోతుండటంతో పార్టీ పరిస్థితి నానాటికీ ఇంకా దయనీయంగా మారుతోందని వారికీ తెలుసు..ప్రజలకు కూడా తెలుసు. కానీ టిటిడిపి నేతలు అసలు ఏమీ జరుగనట్లు నటిస్తూ, ‘తెదేపా పూర్వ వైభవం సాధించడం ఖాయం. తెలంగాణాలో అధికారంలోకి రావడం ఖాయం’ అని చెప్పుకోవడం చూసి ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేసుకోకుండా గత వైభవం తలుచుకొంటూ కూర్చోంటే పూర్వ వైభవం సిద్దిస్తుందా? టిటిడిపి నేతలు ఇదే ధోరణిలో కొనసాగితే మున్ముందు వారి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారడం ఖాయం. కనుక వారి ముందు రెండే మార్గాలున్నాయి. 1. అందరూ కలిసికట్టుగా పనిచేసి తెదేపాను బలోపేతం చేసుకోవడం. 2. ఎవరి దారి వారు చూసుకోవడం. టిటిడిపి నేతలందరూ రెండో దానికే మొగ్గు చూపుతున్నట్లున్నారు. అందుకే చేతులు ముడుచుకొని అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లున్నారు. ఇదే నిజమనుకొంటే, తెదేపా పూర్వ వైభవం సాధించడం మాట దేవుడెరుగు 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో తెదేపా కనబడకపోవచ్చు.