రాజధాని హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మున్సిపల్ మంత్రి కేటిఆర్ చెప్పారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “రంగారెడ్డి జిల్లాలో అహ్మద్ గూడ, కీసర వద్ద రూ.383 కోట్ల వ్యయంతో 20 ఎకరాలలో మొత్తం 4,428 ఇళ్ళు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటి నిర్మాణం కోసం రాయితీ ధరలపై సిమెంటు, స్టీలు ఇప్పిస్తున్నామని తెలిపారు. అలాగే పార్కింగ్, సెట్ బ్యాక్స్, రోడ్లు వంటివాటిలో నిబంధనలు సడలించి కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు మొదలు పెట్టిస్తున్నామని తెలిపారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనే ఆలోచన గొప్పదే. కానీ తెరాసకు నాలుగేళ్ల పాలన పూర్తవుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 50,000 ఇళ్ళను కూడా నిర్మించి ఇవ్వలేకపోయింది. కానీ ఏడాదిలోగా హైదరాబాద్ లోనే లక్ష ఇళ్ళు నిర్మించి చూపుతామని మంత్రి పదేపదే చెప్పారు. వాటిలో కేవలం 4,428 ఇళ్ళ నిర్మాణ పనులు ‘త్వరలో’ మొదలవబోతున్నాయని చెపుతున్నారు. అంటే లక్ష ఇళ్ళ నిర్మాణం కూడా కష్టమేనని అర్ధమవుతోంది.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు అంటే ఇంకా నిర్మాణాలు మొదలవనప్పటికీ ‘దేశంలో మరే ప్రభుత్వం చేయలేని విధంగా తాము మాత్రమే’ ఇళ్ళు నిర్మిస్తున్నామని తెరాస సర్కార్ గొప్పలు చెప్పుకొంటూ వాటి ‘క్రెడిట్’ ను కూడా ‘అడ్వాన్స్’ గా వాడేసుకొంటోంది. కానీ ఐదేళ్ళ పాలన ముగిసే సమయానికి మొత్తం ఎన్ని ఇళ్ళు నిర్మించి లబ్దిదారులకు అందిస్తుందో దానికే తెలియాలి.