కోమటిరెడ్డి కేసులో కాంగ్రెస్ అలసత్వమేల?

March 29, 2018


img

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వ రద్దు వ్యవహారంలో టి-కాంగ్రెస్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందా? అంటే అవుననిపిస్తోంది. ఈ వ్యవహారంలో మొదట వారు ఊహించలేని గట్టి షాక్ ఇచ్చి తెరాసపై చెయ్యి సాధించగలిగింది. తెరాస ఎంపి గుత్తా రాజీనామాతో ఉపఎన్నికలు వస్తాయనుకొంటే, తమ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడం వలన ఉపఎన్నికలు ఎదుర్కోవలసిరావడం టి-కాంగ్రెస్ కు నిజంగా పెద్ద షాక్. అయితే వారు దాని నుంచి త్వరగానే తేరుకొని హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారం మళ్ళీ ఊహించని మలుపు తిరిగింది. 

హైకోర్టు వారి పిటిషన్లను తిరస్కరించకపోగా దీనిపై తుది తీర్పు వెలువడేవరకు ఉపఎన్నికలు నిర్వహించవద్దని ఈసీకి ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క కాంగ్రెస్ సభ్యులు దోషులని నిరూపించే వీడియో ఫుటేజిని సమర్పించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. 

హైకోర్టు ఆదేశాలు, దాని నిర్ణయం తెరాస సర్కార్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ తప్పటడుగుకు అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు హైకోర్టుకు ఏమి సమాధానం చెప్పాలా? అని తెరాస సర్కార్ ఆలోచనలోపడింది.

తమ ఎమ్మెల్యేలిద్దరినీ దెబ్బతీయబోయి తెరాస సర్కార్ న్యాయస్థానంలో ఇరుక్కుపోయినప్పుడు, టి-కాంగ్రెస్ నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉండాలి. అందరూ కలిసికట్టుగా తెరాసపై ఎదురుదాడి చేసి రాజకీయంగా పైచెయ్యి సాధించే ప్రయత్నం చేయాలి. కానీ అందరూ మౌనం వహించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. డికె అరుణ, డి శ్రీధర్ బాబు వంటి ఒకరిద్దరు దీని గురించి గట్టిగా మాట్లాడారు కానీ మిగిలిన కాంగ్రెస్ నేతలందరూ ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నట్లు దూరంగా...మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీలో అనైఖ్యతకు ఇది అద్దం పడుతోంది. 

పార్టీలో మిగిలిన నేతలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లతో విభేదాలు ఉంటే ఉండవచ్చు కానీ తమ రాజకీయ శత్రువు (తెరాస) ఈవిధంగా కురుక్షేత్రంలో కర్ణుడిలాగ చిక్కుకుపోయినప్పుడు, టి-కాంగ్రెస్ నేతలందరూ కూడా అస్త్ర సన్యాసం చేసినట్లు మౌనంగా చూస్తూ కూర్చోవడం అవివేకమేనని చెప్పక తప్పదు. ఒకవేళ ఇదే పరిస్థితిలో కాంగ్రెస్ చిక్కుకొని పోయుంటే, తెరాస నేతలందరూ మూకుమ్మడిగా దాడి చేసి ఉండేవారు. కనుక కాంగ్రెస్ నేతల అనైఖ్యతే తెరాసకు శ్రీరామరక్ష అని చెప్పవచ్చు.


Related Post