ప్రకాష్ రాజ్ కు కెసిఆర్ తో పనేమిటో?

March 29, 2018


img

నటుడు ప్రకాష్ రాజ్ గురువారం అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కార్యాలయంలో వారిరువురూ కొంతసేపు చర్చించుకొన్న తరువాత అసెంబ్లీని సందర్శించి వెళ్ళిపోయారు. దీంతో ఇంత ఆకస్మికంగా ప్రకాష్ రాజ్ అసెంబ్లీకి ఎందుకు వచ్చారో...ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎందుకు కలిసారో...వారిరువురూ ఏమి మాట్లడుకొన్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.

ప్రకాష్ రాజ్ చాలా కాలంగా భాజపా మతతత్వ పోకడలను, మోడీ సర్కార్ అసహనాన్ని, నియంతృత్వ పాలనను, అనాలోచిత నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య జరిగినప్పటి నుంచి అయన మోడీ సర్కార్, భాజపాపై మండిపడుతున్నారు. 

ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక దక్షిణాది రాష్ట్రాల సినీ ప్రముఖులతో, రాజకీయ నాయకులందరితో మంచి పరిచయాలున్న ప్రకాష్ రాజ్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు తన వంతు సహాయసహకారాలు అందిస్తానని చెప్పడానికి కెసిఆర్ ని కలిసి ఉండవచ్చు. లేదా మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలలో భాజపాను ఓడించడానికి తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కెసిఆర్ సలహాలు సూచనలు కోరేందుకు కలిసి ఉండవచ్చు. లేదా మహబూబ్ నగర్ జిల్లాలోని తను దత్తత తీసుకొన్న కొండారెడ్డిపల్లె గ్రామానికి సంబందించిన పనుల గురించి కలిసి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ భాజపాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కెసిఆర్ ను కలవడం చాలా ఆసక్తికరమైన విషయమే.       



Related Post