అప్పుడప్పుడు న్యూస్ పేపర్లలో పేరు మార్పు ప్రకటనలు చూస్తుంటాము. కానీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరులో మార్పు జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ సాహసం చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ 2017లో చేసిన అభ్యర్ధన మేరకు బాబా సాహెబ్ పేరులో ‘రాంజీ’ అనే పేరును చేర్చుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం బుదవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఇకపై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును ‘డాక్టర్ బాబా సాహెబ్ రాంజీ అంబేద్కర్’ అని సంభోదించాలని పేర్కొంది. ప్రభుత్వ రికార్డులు, న్యాయస్థానాలు, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు, ఎన్జీవోలలో అన్నీ తమ రికార్డులలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరులో మార్పు చేసుకోవాలని ఆదేశించింది.
ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యోగీ సర్కార్ తన మతత్వాన్ని బాబా సాహెబ్ కు అంటగట్టాలని ప్రయత్నించడం చాలా శోచనీయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే యోగి సర్కార్ తన వాదనను సమర్ధించుకొనేందుకు చెపుతున్న కారణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అది అంబేద్కర్ తండ్రి పేరని, మహారాష్ట్రలో పుట్టినవారందరూ తమ పేరులో తండ్రిపేరును కూడా జోడించి చెప్పుకొంటారని, అందుకే అంబేద్కర్ పేరులో అయన తండ్రి రాంజీ పేరును జోడించామని భాజపా నేతలు వాదిస్తున్నారు. కానీ ఇటువంటి చవుకబారు ఆలోచనలు చేస్తున్న యోగీ సర్కార్ వాటికి మూల్యం చెల్లించకతప్పదని సమాజ్ వాదీ నేత దీపక్ మిశ్రా హెచ్చరించారు.