తెరాస సర్కార్ కు కాగ్ నివేదికలో గట్టిగా మొట్టికాయలు పడ్డాయి. ప్రభుత్వం చెప్పుకొంటున్న గొప్పలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో చూపిన తప్పులు, లోపాలు:
1. రుణాల ద్వారా సేకరించిన సొమ్మును రెవెన్యూ రాబడిగా చూపించింది. తద్వారా ద్రవ్యలోటు రూ. 5,000 కోట్లు ఉండగా దానిని రూ.2,500 కోట్లుగా చూపించింది.
2. అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినందున రాష్ట్ర ప్రభుత్వంపై రూ.5,280 కోట్లు అదనపు భారం పడింది.
3. ఇందిరమ్మ వరద కాలువ నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.4,711 కోట్లతో ఆశించిన ప్రయోజనం సిద్ధించలేదు. దాని కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోవడంతో వాటిలో 50 శాతం మిగిలిపోయాయి.
4. ఎస్సీ, ఎస్టీ సబ్-ప్లాన్ నిధులు కూడా ఖర్చు చేయలేదు.
5. ప్రభుత్వంలో ఆర్ధిక క్రమశిక్షణ లోపించింది.
6. విద్యుత్ ఛార్జీలు సకాలంలో వసూలు చేస్తున్నారు కానీ అవి సకాలంలో ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదు.
7. టి-హబ్ రెండవ దశ భావన నిర్మాణంలో జరిగిన అక్రమాల వలన ప్రభుత్వానికి రూ.16.70 కోట్లు నష్టం వచ్చింది.
8. ఇసుక కొనుగోలులో అవినీతి వలన ప్రభుత్వానికి రూ.18 కోట్లు నష్టం వచ్చింది.
9. రాష్ట్రంలో జరుగుతున్న ప్రసవాలలో నేటికీ సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా జరుగుతున్నవే ఎక్కువగా ఉన్నాయి.
10. పధకాల అమలుకు తీసుకొన్న నిధులకు ‘యుసి’ లు సమర్పించడం లేదు. కొన్ని పధకాలు మొదలుపెట్టకుండానే, నిధులు రాకుండానే ‘యుసి’ లు సమర్పించారు.
11. వాల్టా చట్టం అమలులో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించింది.
12. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టు పనులు చేపట్టడంలేదు.