సౌదీపై క్షిపణి దాడి!

March 28, 2018


img

సౌదీ అరేబియాపై ఆదివారం రాత్రి క్షిపణులతో దాడి జరిగింది. అయితే వాటన్నిటినీ సౌదీ-అమెరికా సంయుక్త దళాలు వాటిని మిసైల్ విద్వాంస క్షిపణులతో గాలిలోనే పేల్చి వేయడంతో పెనుప్రమాదం తప్పింది. వాటిని యెమెన్ నుంచి హౌతి తిరుగుబాటుదారులు సౌదీఅరేబియా రాజధాని రియాద్, ఖమిస్ ముషాయత్, నజరాన్, జిజాన్ అనే ప్రాంతాలపైకి  ప్రయోగించారు. క్షిపణులను విద్వంసం చేసినప్పుడు వాటి శకలాలు తగిలి సౌదీలో నివసిస్తున్న ఒక ఈజిప్షియన్ పౌరు మరణించినట్లు సౌదీ ప్రభుత్వం తెలియజేసింది. అయితే సౌదీలో నాలుగు విమానాశ్రయాలతో సహా ఏడు వేర్వేరు ప్రాంతాలలో లక్ష్యాలను అవి చేధించాయని వాటిని ప్రయోగించిన హౌతి తీవ్రవాదులు ప్రకటించారు. 

సౌదీ సంయుక్త దళాలు గత మూడేళ్ళుగా యెమెన్ దేశంలో హౌతి తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేస్తున్నాయి. అందుకే వారు సౌదీపై క్షిపణి దాడులు చేస్తున్నారు. ఇదివరకు కూడా వారు ఒకసారి సౌదీలో సనా అనే పట్టణంపై క్షిపణి దాడులు చేశారు. వాటిని సమర్ధంగా ఎదుర్కొన్న తరువాత సౌదీ సంయుక్త దళాలు హౌతి తిరుగుబాటుదారులపై తీవ్రస్థాయిలో వైమానిక దాడులు చేశాయి. కనుక మళ్ళీ ఇప్పుడు కూడా వారిపై సౌదీ దళాలు ప్రతీకార దాడులు చేయవచ్చు. అయితే తమపై వైమానిక దాడులు నిలిపివేస్తేనే తాము క్షిపణి దాడులు నిలిపివేస్తామని హౌతి నాయకుడు సాలె-అల్-సమాద్ చెప్పారు. 

సౌదీపై క్షిపణి దాడులను భారత్ తో సహా అనేకదేశాలు ఖండించాయి. అయితే సౌదీ సంయుక్త దళాలు హౌతి తిరుగుబాటుదారులపై , అమెరికా, రష్యా తదితర దేశాలు ఐసిస్ ఉగ్రవాదులను నిర్మూలించే ప్రయత్నంలో ఇరాక్, సిరియా తదితర దేశాలపై బాంబుల వర్షం కురిపిస్తుంటే అనేక వేలమంది ప్రజలు, చిన్నారులు చనిపోతున్నా ఏ దేశమూ ఆ వైమానిక దాడులను ఖండించడం లేదు.         

అంటే క్షిపణి దాడులు తప్పు కానీ వైమానిక దాడులు చేస్తే తప్పు కాదు అన్నట్లుంది. ఐసిస్ ఉగ్రవాదులను నిర్మూలించడం కోసం అమాయకులైన పౌరులను, చిన్నారులను బాలి చేయడాన్ని ఏమనాలి?


Related Post