ముసుగులో గుద్దులాటలేవ్: కెసిఆర్

March 28, 2018


img

సంక్షేమ పధకాలు ప్రజల కోసమే కాదు ప్రభుత్వాలను నడుపుతున్న పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కూడా అని ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న శాసనసభలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రజలను ప్రసన్నం చేసుకొని ఎన్నికలలో వారి ఓట్లను సంపాదించుకోవడం కోసమే ఆకర్షణీయమైన సంక్షేమ పధకాలను ప్రభుత్వాలు ప్రవేశపెడుతుంటాయని కెసిఆర్ అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఆ ఉద్దేశ్యంతోనే సంక్షేమ పధకాలను అమలుచేస్తుంటాయని, అందుకు తమ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కూడా అతీతం కాదని చెప్పారు. ఓట్లు, అధికారం సాధించలేనప్పుడు రాజకీయ పార్టీలు పెట్టుకొని ఏమి ప్రయోజనం అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలన్నిటి అంతిమ లక్ష్యం అధికారమేనని స్పష్టం చేశారు. అయితే తమ ప్రభుత్వానికి తెలంగాణా అభివృద్ధి ఒక ‘టాస్క్’ గా భావిస్తుంటే, మిగిలిన పార్టీలకు అది కేవలం రాజకీయం మాత్రమేనని అన్నారు. 

ఓట్లు, అధికారం సంపాదించుకొని దానిని నిలబెట్టుకోవడం కోసమే ప్రభుత్వాలు సంక్షేమ పధకాలను అమలుచేస్తుంటాయని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజమే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పంట రుణాల మాఫీ, రాయితీ గొర్రెల పంపిణీ, పంట పెట్టుబడి, కెసిఆర్ కిట్స్, బతుకమ్మ చీరలు వంటివన్నీ అందుకు ఉదాహరణలుగా నిలుస్తాయి. అయితే ఇంతకాలం కేవలం ప్రజల సంక్షేమం కోసమే వాటిని అమలుచేస్తున్నామని గొప్పలు చెప్పుకొన్న ముఖ్యమంత్రి కెసిఆర్, మాయాబజార్ సినిమాలో ‘సత్యపీఠం’ పై నిలబడినప్పుడు తన మనసులో మాటలను దాపరికం లేకుండా బయటకు చెప్పేసినట్లుగానే, శాసనసభలో నిలబడి వాటి పరమార్ధం ఏమిటో దాపరికం లేకుండా చెప్పేశారు. కానీ దేశరాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ తీసుకువస్తానని ప్రకటించిన కెసిఆర్ సంక్షేమ పధకాల అమలు గురించి ఈవిధంగా చెప్పడమే ఆశ్చర్యకరం.

అయితే అయన చెప్పినా చెప్పకపోయినా, రాజకీయ పార్టీల హామీలు, పధకాలన్నీ ఓట్లు, సీట్లు, అధికారం, పదవుల కోసమేననే నిజం దేశప్రజలందరికీ తెలుసు. కానీ ఉన్న పార్టీలలోనే దేనినో ఒకదానిని ఎన్నుకోవలసి ఉంటుంది కనుక ఎక్కువ హామీలు, గొప్ప ‘ఎన్నికల బహుమతులను’, ఆకర్షణీయమైన పధకాలను ప్రకటించినవాటికే ఓట్లు వేస్తుంటారు. కనుక రాజకీయ పార్టీలను తప్పుపట్టడమంటే గొంగళి (తివాచీ)పై కూర్చొని వెంట్రుకలు ఏరుకోవడమే అవుతుంది.


Related Post