లోక్ సభ వాయిదా... షరా మామూలే

March 28, 2018


img

అన్నాడిఎంకె సభ్యుల ఆందోళన కారణంగా లోక్ సభను సోమవారానికి వాయిదాపడింది. తెదేపా, వైకాపాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను పట్టించుకాకపోయినా కనీసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని మోడీ సర్కార్ ధైర్యంగా ఎదుర్కొంటుందని అందరూ భావించారు. కానీ లోక్ సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోకుండా కుంటిసాకులతో తప్పించుకొంటూ మోడీ సర్కార్ తన అభద్రతాభావాన్ని బయటపెట్టుకొంది. అంతేకాదు...రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఏపికి అన్యాయం చేసింది కనుకనే వాటిని ఎదుర్కోవడానికి భయపడుతోందని కాంగ్రెస్, తెదేపాలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చినట్లయింది. మోడీ సర్కార్ తీరు చూస్తే ఈ బడ్జెట్ సమావేశాలను ఈవిధంగానే ముగించేయాలని భావిస్తున్నట్లుంది.

ఇంతకు ముందు జరిగిన సమావేశాలను అది ఏవిధంగా ముగించినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు కానీ అవిశ్వాస తీర్మానాల కారణంగా దేశప్రజలందరూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరును నిశితంగా గమనిస్తున్నారు. ప్రతిపక్షాలను ధైర్యంగా ఎదుర్కొని తన నిజాయితీని, శక్తి సామర్ధ్యాలను నిరూపించుకోవలసిన మోడీ సర్కార్ కుంటిసాకులతో తప్పించుకుపోతుండటంతో అందరూ దానినే వేలెత్తి చూపిస్తున్నారు. అయినా మోడీ సర్కార్ ఖాతరు చేయడం లేదు.

అధికారంలో ఉన్న పార్టీలు ఈవిధంగా అహంకారం ప్రదర్శించిన ప్రతీసారి ఎన్నికలలో ఓటమిపాలవుతుంటాయని పలుమార్లు నిరూపితమైంది. ఆవిధంగా 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకొంది. రాబోయే ఎన్నికలలో భాజపా మూల్యం చెల్లించుకొంటుందేమో?


Related Post