కోమటిరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్

March 28, 2018


img

శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఆయనపై హెడ్ ఫోన్స్ విసిరి దాడికి ప్రయత్నించారనే ఆరోపణలతో స్పీకర్ మధుసూధనాచారి వారిరువురి శాసనసభ్యత్వాన్ని రద్దు చేశారు. కానీ తాము ఎవరిపై దాడి చేయలేదని, రాజకీయ దురుదేశ్యంతోనే తమపై అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వం శాసనసభ్యత్వం రద్దు చేసిందని ఆరోపిస్తూ వారిరువురూ హైకోర్టులో పిటిషన్ వేశారు. మొదటిసారి ఈ కేసు విచారణ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి, వారిరువురూ దాడికి ప్రయత్నించినట్లు నిరూపించే వీడియో ఫుటేజిని హైకోర్టుకు సమర్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఈ కేసులో అయన సమర్ధంగా వాదించకపోవడం వలన ప్రభుత్వానికి న్యాయస్థానంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అసంత్ర్యప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం అందడంతో అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి ఆదివారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఏఏజి రామచంద్రరావు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా ఆ వీడియో ఫుటేజిని కోర్టుకు ఎప్పుడు సమర్పిస్తారని జస్టిస్ బి. శివశంకరరావు నిలదీశారు. అయన చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

తాను అసెంబ్లీ తరపున హాజరుకాలేదని, న్యాయశాఖ తరపున కేవలం అడ్వకేట్ జనరల్ ప్రతినిధిగా మాత్రమే హాజరయ్యాయని కనుక ఆ వీడియో ఫుటేజి విషయంలో అసెంబ్లీయే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. అదే పేర్కొంటూ మెమో సమర్పించమని న్యాయమూర్తి అడుగగా, దానికీ అసెంబ్లీయే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని సమాధానం చెప్పారు. అయినా ఇది అసెంబ్లీ పరిధిలో ఉండే వ్యవహారమని కనుక న్యాయస్థానానికి దీనిలో జోక్యం చేసుకొనే హక్కు లేదని వాదించారు. 

పిటిషనర్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల తరపున వాదిస్తున్న అడ్వకేట్ జంద్యాల రవిశంకర్ ఆయన వాదనలను ఖండించారు. వీడియో ఫుటేజిని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఇటువంటి కారణాలతో ప్రభుత్వం వెనక్కు తీసుకోలేదని, ప్రభుత్వం దానికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని వాదించారు. అయన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ, ఏప్రిల్ 3వ తేదీలోగా ఆ వీడియో ఫుటేజిని న్యాయస్థానానికి సమర్పించాలని లేకుంటే పిటిషనర్స్ ఇద్దరూ ఆ నేరానికి పాల్పడలేదని భావించి తీర్పు చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు. 

కాంగ్రెస్ శాసనసభ్యులు దాడిలో శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయం అయ్యిందని చెపుతూ ప్రభుత్వం ఆయనకు చికిత్స కూడా చేయించింది. అదే కారణం చెపుతూ వారి సభ్యత్వం రద్దు చేసింది. దాని కోసం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వెంటనే కేంద్ర ఎన్నికల కమీషన్ కు కూడా ఈ విషయం తెలియజేసి, ఖాళీ అయిన ఆ రెండు స్థానాలలో ఉపఎన్నికలు నిర్వహించవలసిందిగా కోరింది. 

వారిరువురూ దాడి చేయడం నిజమైతే, ఆ వీడియో ఫుటేజిని న్యాయస్థానానికి సమర్పించడానికి ప్రభుత్వం సంకోచించనవసరం లేదు. కానీ ఇప్పుడు అది అసెంబ్లీ పరిధిలో వ్యవహారమని తప్పించుకొనే ప్రయత్నం చేయడమే అనుమానానికి తావిస్తోంది. తాము దాడి చేయలేదని శాసనసభ్యులిద్దరూ వాదిస్తున్నారు. చేశారని ప్రభుత్వం ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకొంది. కనుక వారి నేరాన్ని నిరూపించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. లేకుంటే వారిరువురూ ఆ నేరం చేయలేదని హైకోర్టు తీర్పు చెపితే అప్పుడు కూడా ప్రభుత్వమే ఇంకా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. వారిపై వేటు వేసినప్పుడు తెరాస వారిపై పైచెయ్యి సాధించినట్లు కనిపించింది. కానీ చివరికి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది. 


Related Post