మమతా దీదీ ఏ క్యా హై?

March 27, 2018


img

సిఎం కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనకు మొట్టమొదట సంఘీభావం తెలిపిన వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అందుకే కెసిఆర్ మొట్టమొదట కోల్ కతా వెళ్ళి ఆమెతోనే ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు. ఆ తరువాత వారిద్దరూ ఫ్రంట్ ఏర్పాటు ఖాయం అన్నట్లే మాట్లాడారు. కానీ అంతకుముందే ఆమె కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్న కూటమి గురించి చర్చించేందుకు డిల్లీ పర్యటన ఖరారు చేసుకొన్నారు. సిఎం కెసిఆర్ కు ఈ సంగతి తెలియదనుకోలేము. 

ఊహించినట్లుగానే ఆమె సోమవారం డిల్లీ చేరుకొన్నారు. ఇవ్వాళ్ళ ఆమె సోనియా, రాహుల్ గాంధీలతో సహా ప్రతిపక్ష నేతలను కలువనున్నారు. రేపు డిల్లీలో శరత్ పవార్ నివాసంలో జరుగబోయే భాజపా వ్యతిరేక పార్టీల నేతల సమావేశానికి ఆమె కూడా హాజరవబోతున్నారు. ఆ సమావేశం ప్రధానోదేశ్యం మోడీ సర్కార్ ను గద్దె దింపేందుకు భాజపాను వ్యతిరేకించే పార్టీలన్నిటినీ కూడగట్టడమే. వాటికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుంది కనుక రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయడం దాని రెండవ లక్ష్యం. యూపియే కూటమిలో ఇప్పటికే అనేక పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడు మరికొన్ని పార్టీలు దానితో కలిసి పనిచేయడానికి ముందుకు రావచ్చు. వాటిలో మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒకటి కావచ్చు. 

దేశాన్ని, తెలంగాణా రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని కెసిఆర్ గట్టిగా వాదిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అయన ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొన్నారో, మమతా బెనర్జీ అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి ఇప్పుడు సిద్దపడుతున్నారు. అంటే ఆమెను నమ్ముకొని ప్రయోజనం లేదని స్పష్టం అవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఇంకా అనేక పార్టీలు కూడా దానితోనే చేతులు కలుపుతాయి. అప్పుడు  కెసిఆర్ ఒంటరిగా మిగిలిపోవచ్చు. కనుక ఫ్రంట్ ఏర్పాటులో కెసిఆర్ తొందరపడినట్లే కనిపిస్తోంది. ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించి, ఇంత హడావుడి చేసిన తరువాత ఒకవేళ ఆ ప్రతిపాదనను అటకెక్కిస్తే నవ్వులపాలవుతారు. అలాగని మొండిగా ముందుకు వెళితే ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది. కనుక  కెసిఆర్ ఏమి చేస్తారో చూడాలి. 


Related Post