కోమటిరెడ్డిని దెబ్బతీయబొతే...

March 26, 2018


img

కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం రద్దు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఊహించని గట్టి దెబ్బ తీసిన తెరాసకు ఎదురుదెబ్బ తగిలినట్లు తాజా సమాచారం. వారిరువురూ స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు, తెరాస సర్కార్ తరపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి న్యాయస్థానంలో వాదించారు. కానీ హైకోర్టు అయన వాదనలతో ఏకీభవించలేదు. కాంగ్రెస్ సభ్యులు ఇద్దరూ దోషులని నిరూపించే వీడియో ఫుటేజిని సమర్పించాలని ఆదేశించడమే కాకుండా ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు నల్గొండ, అలంపూర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించవద్దని ఈసీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈరెండు పరిణామాలు తెరాస సర్కార్ ఊహించని పరిణామాలే. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి సమర్ధంగా వాదించకపోవడంవలననే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ కారణంగా అయన సోమవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసినట్లు సమాచారం. మరికొద్ది సేపటిలో అయన ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి మాట్లాడిన తరువాత, అయన రాజీనామాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలైన రోజే అత్యుత్సాహం ప్రదర్శించి కాంగ్రెస్ భంగపడితే, కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ తీసిన తెరాస ఈవిధంగా ఎదురుదెబ్బ తినడం ఆశ్చర్యకరమే. 



Related Post