మోడీ సర్కార్ గ్రహస్థితి బాగోలేదా?

March 26, 2018


img

 మోడీ సర్కార్...భాజపాల గ్రహస్థితి ఏమీ బాగున్నట్లు లేదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి అన్ని అపశకునాలే...ఊహించని విరోధాలే! 

మొట్ట మొదట పరిణామం మిత్రపక్షాలైన తెదేపా, శివసేన దూరం అవడం. భాజపాకు తెదేపా దూరమవడమే కాక మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. కనీసం 10మంది ఎంపిలు కూడా లేని వైకాపా రోజుకో అవిశ్వాస తీర్మానం నోటీసు మోడీ సర్కార్ చేతిలో పెడుతూనే ఉంది. 

ఆ రెండూ ప్రాంతీయ పార్టీలని పట్టించుకోకుండా తప్పించుకొంటే, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం పార్టీలు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. 

ఇక గత నాలుగేళ్ళుగా మోడీ సర్కార్ తో చాలా స్నేహంగా, వినయంగా మెలిగిన కెసిఆర్, మోడీని గద్దె దించడానికి ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.   

ఇక మోడీ సర్కార్ ఊహించని మరో పరిణామం ఏమిటంటే, ఇన్ని రోజులుగా రిజర్వేషన్ల కోసం లోక్ సభలో ఆందోళన చేస్తూ అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా అడ్డుకొంటున్న తెరాస ఎంపిలు రేపటి నుంచి వెనక్కు తగ్గబోతున్నారు.  రిజర్వేషన్ల కోసం లోక్ సభలో తాము చేస్తున్న ఆందోళనలను తమ రాజకీయ ప్రత్యర్ధులు తెలివిగా ఉపయోగించుకొంటూ కెసిఆర్ ను మోడీతో లంకె పెట్టి తమపై చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణల వలన తెరాస గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని గ్రహించి ఇకపై తాము అవిశ్వాస తీర్మానాలకు అడ్డుపడబోమని, అవి చర్చకు వస్తే తాము కూడా దానిలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. 

మోడీ సర్కార్ పై రాహుల్ గాంధీ నానాటికీ తన దాడిని తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. ఏపిని మోసం చేశాననే అపరాధభావన ఉన్నందునే మోడీ సర్కార్ ఇన్ని రోజులుగా కుంటిసాకులతో అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోకుండా తప్పించుకొంటోందని, పైకి బోలెడు ప్రగల్భాలు పలికే మోడీ ఇంత పిరికిపంద అని అనుకోలేదని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. 

భాజపాకు షాక్ కలిగించే వార్త ఒకటి ఇవాళ్ళే బయటపడటం యాదృచ్చికమే. త్వరలో జరుగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో భాజపా ఓడిపోబోతోందని సి-ఫోర్స్ అనే సంస్థ తన సర్వే నివేదికను ఈరోజే బయటపెట్టింది. గత ఎన్నికలకు ముందు ఈ సర్వే సంస్థ చెప్పిన జోస్యం ఫలించి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈసారి కూడా కర్ణాటకలో భాజపాకు ఓటమి తప్పదనే అభిప్రాయం వినపడుతోంది.

2014 ఎన్నికల నుంచి నేటి వరకు ఎదురులేదన్నట్లు పాలిస్తున్న మోడీ సర్కార్ కు ఒక్కసారిగా ఇంత వ్యతిరేక పరిస్థితులు ఎదురవుతుండటం ఆశ్చర్యకరమే. అయితే మోడీ, అమిత్ షాలు ఇంతకంటే కటినమైన అగ్నిపరీక్షలను అనేకసార్లు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాదించారు కనుక వీటన్నిటికీ వారు భయపడి వెనక్కు తగ్గుతారనుకోలేము. కాంగ్రెస్ పార్టీ కోరినట్లుగా మంగళవారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నట్లు తాజా సమాచారం. 


Related Post