భాజపాకు ఓటమి తప్పదట!

March 26, 2018


img

గుజరాత్ ఎన్నికల తరువాత తమ తదుపరి లక్ష్యం కర్ణాటక రాష్ట్రమేనంని భాజపా చెప్పుకొంది. కానీ అధికార కాంగ్రెస్ చేతిలో భాజపాకు ఘోరపరాజయం తప్పదని సి-ఫోర్స్ అనే సర్వే సంస్థ తేల్చి చెప్పింది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. వాటిలో కనీసం 126 స్థానాలు కాంగ్రెస్ పార్టీయే దక్కించుకొని మళ్ళీ అధికారంలోకి రాబోతోందని ఆ సర్వే తేల్చి చెప్పింది.

ఈ నెల 1వ తేదీ నుంచి 25వరకు నిర్వహించిన సర్వేలో కర్ణాటకలో మొత్తం 326 పట్టణ ప్రాంతాలు, 977 గ్రామీణ ప్రాంతాలలో గల 154 నియోజక వర్గాలలో 22,357 మందిని ప్రశ్నించినట్లు ఆ సంస్థ తెలిపింది. 2013 ఎన్నికలకు ముందు ఇదే సంస్థ సర్వే చేసి కాంగ్రెస్ పార్టీకి సుమారు 199-120 సీట్లు రావచ్చని ప్రకటించగా 122 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా తాము చెప్పిన దానికి ఒక్క శాతంలోపుగానే ఫలితాలు ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మరో 4 సీట్లు, 9 శాతం ఓట్లు పెరిగే అవకాశం కూడా ఉందని ఆ సంస్థ తెలిపింది. 

ఈ ఎన్నికలలో భాజపా కేవలం 70 సీట్లు గెలుచుకోవచ్చునని తెలిపింది. ఇవి గతంలో కంటే 30 సీట్లు ఎక్కువే కానీ భాజపా విజయం సాధించలేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీకి 46 శాతం, భాజపాకు 31, జెడిఎస్ కు 16 శాతం ఓట్లు పడవచ్చని తెలిపింది. 

కేంద్రం తమని మోసం చేసిందనే ఆంధ్రా, తెలంగాణాల వాదనలు, కావేరీ జలవివాదం, శ్రీరాం సేనల ఆగడాలు, మేధావుల హత్యలు, ప్రధాని నరేంద్ర మోడీపై, అయన ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న తీవ్ర విమర్శలు, అవినీతిపరుడైన ఎడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా చేయాలనుకోవడం, ఎన్నికల ప్రచారంలో మోడీ సర్కార్ పై రాహుల్ గాంధీ చేస్తున్న తీవ్ర విమర్శలు వంటివి కర్ణాటక ప్రజలలో భాజపాపట్ల వ్యతిరేకతను పెంచేలా చేసి ఉండవచ్చు. 

దక్షిణాదిన మళ్ళీ పాగా వేయాలని ఆరాటపడుతున్న భాజపాకు ఈ సర్వే ఫలితాలు పెద్ద షాక్ వంటివే. దక్షిణాది రాష్ట్రాలలో భాజపాకు చాలా బలమున్న రాష్ట్రం కర్ణాటక. అక్కడే అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోతే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈసారి ఈ గండం గట్టెక్కేందుకు మోడీ, అమిత్ షా;లు ఎటువంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.  


Related Post