ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా లోక్ సభలో రోజూ వరుసగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్న వైకాపా ఎంపిలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తారని ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రకటించారు.
ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తన పార్టీ ఎంపిలతో సమావేశమయ్యి దీనిపై చర్చించేరు. అనంతరం మేకపాటి తమ సమావేశ వివరాలను మీడియాకు తెలియజేస్తూ, “పార్లమెంటు నిరవధిక వాయిదాపడిన మరుక్షణం మా ఎంపిలు అందరూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేస్తాము. మేము మోడీ సర్కార్ తో కుమ్మక్కు అయ్యామని, భాజపాతో పొత్తులు పెట్టుకోబోతున్నామని తెదేపా నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాము. మేము మొదటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని పోరాడుతూనే ఉన్నాము. చివరి వరకు దానికే కట్టుబడి ఉన్నాము. కానీ తెదేపా మాత్రం రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తోంది. మా నిజాయితీని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఇంకా అనేక ఇతర పార్టీలు గుర్తించాయి కనుకనే అవి మా పోరాటానికి మద్దతు పలకడానికి ముందుకు వచ్చాయి. కానీ ఏపిలో అధికారంలో ఉన్న తెదేపా మాత్రం ముందుకు రాలేదు. కనీసం ఇప్పటికైనా తెదేపా ఎంపిలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలి. లేకుంటే ప్రజలు వారిని క్షమించరు,” అని అన్నారు.
వైకాపాకు లెక్క ప్రకారం 8 మంది, తెదేపాకు 15మంది లోక్ సభ సభ్యులున్నారు. అదేవిధంగా వైకాపాకు ఒకరు, తెదేపాకు 5 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వైకాపా సభ్యులు రాజీనామాలు చేసిన తరువాత తెదేపా సభ్యులు పదవులలో కొనసాగితే, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి కనుక బహుశః వారు కూడా రాజీనామాలు చేయవచ్చు. అదేకనుక జరిగితే, ఏపిలో ఉపఎన్నికలు జరగడం తధ్యం. తెదేపా, వైకాపా, భాజపాలకు అవే సెమీ ఫైనల్స్ అవుతాయి.