ప్రభుత్వోగుల యుద్ధ శంఖారావం

March 26, 2018


img

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఒక్క ఏడాదే ఉంది కనుక కేంద్ర బడ్జెట్ లో తమకు అన్యాయం జరిగిందంటూ అన్ని రాష్ట్రాలు కేంద్రంపై యుద్ధం ప్రకటించాయి. సరిగ్గా అదే కారణంతో రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. పి.ఆర్.సి.ని ప్రకటించాలి. బదిలీలపై నిషేధం ఎత్తివేయాలి. సిపిఎస్ ను రద్దు చేయాలి. సమానపనికి సమానవేతనం ఇవ్వాలి, అనే నాలుగు ప్రధాన డిమాండ్లతో 31 జిల్లాలలోని ప్రభుత్వోద్యోగులు ఆదివారం సరూర్ నగర్ లో ‘సకల ఉద్యోగుల మహాసభ’ నిర్వహించారు. ఈ సభకు సుమారు 200 సంఘాల ఉద్యోగులు, నేతలు హాజరయ్యారు. 

ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకు జరిగిన సభలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, “తెలంగాణా సాధన కోసం మనం పోరాటాలు చేశాము. ఆ తరువాత బంగారి తెలంగాణా కోసం రేయింబవళ్ళు పనిచేస్తున్నాము. అవసరమైనప్పుడు రాష్ట్రం కోసం మన వేతనాలను విరాళాలుగా అందించాము. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలమేరకు కేవలం 100 రోజులలోనే భూరికార్డులన్నిటినీ ప్రక్షాళన చేశాము. నాలుగేళ్ళు రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసిన మనం ఇప్పుడు మన హక్కుల కోసం పోరాడవలసి వస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ కు మనమంటే చాలా ప్రేమాభిమానాలున్నాయి. కానీ దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడన్నట్లు మధ్యలో ఉండే కొందరు అధికారులు అడ్డుపడుతున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలుసుకొనేందుకు మనకు అవకాశం ఇస్తే, మన సమస్యలను, డిమాండ్లను ఆయన తప్పకుండా పరిష్కరిస్తారనే నమ్మకం మాకుంది. ఒకవేళ ప్రభుత్వం మా సమస్యలను, డిమాండ్లను పరిష్కరించకపోతే మాకు పోరాటాలు కొత్త కాదు కనుక మళ్ళీ పోరాడటానికి వెనుకాడబోము,” అని అన్నారు. 

ఈ సభకు ఐకాస ఛైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి, టీజీవోల ఛైర్మన్‌, ఎమ్యెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిండ్ల రాజేందర్‌, గ్రూపు-1 అధికారుల సంఘాధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌, అధ్యాపకుల సంఘం ఐకాస ఛైర్మన్‌ మధుసూధనరెడ్డి, ఇంకా పద్మాచారి, శివశంకర్‌, సతీష్‌, మణిపాల్‌రెడ్డి తదితరులు అనేకమంది హాజరయ్యి సభలో ప్రసంగించారు. 


Related Post