మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేటికీ తెదేపా ఎమ్మెల్యేగానే ఉన్నందునేమో, తెదేపా రాజకీయ వ్యవహారాలపట్ల ఆసక్తి చూపుతుంటారు. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ, “ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తెదేపా సెల్ఫ్ గోల్ చేసుకొంది. నాలుగేళ్ళు దానితో కలిసి పనిచేసినప్పుడు ప్రత్యేకహోదాతో సహా ఏపికి రావలసినవాటి గురించి గట్టిగా కేంద్రాన్ని నిలదీయకుండా కాలక్షేపం చేసేసి, ఇప్పుడు హటాత్తుగా భాజపాతో తెగతెంపులు చేసుకొని ప్రత్యేకహోదా కావాలని అడగడం ప్రజలను మభ్యపెట్టడానికేనని భావిస్తున్నాను. తెదేపా కూడా అందుకే మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెడుతోంది. అయితే మోడీ సర్కార్ కు లోక్ సభలో 273 మంది సభ్యులున్నప్పుడు దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వలన ఏమి ప్రయోజనం? అది కూడా ప్రజలను మభ్యపెట్టడానికేనని భావిస్తున్నాను. ఏపిలో రాజకీయ పార్టీలు తెలంగాణా ఉద్యమాన్ని చూసైనా తమ రాష్ట్ర ప్రయోజనాలకోసం కలిసి కట్టుగా పోరాడి ఉండి ఉంటే అన్నీ సమకూరిఉండేవి. కానీ తెదేపా తో సహా ఏపి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యేకహోదా పేరుతో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్డీయే నుంచి తెదేపా వైదొలగిన తరువాత వైకాపా ఎంపిలు ప్రధాని మోడీని కలుసుకొంటుంటే చంద్రబాబు నాయుడుకు దేనికి అభ్యంతరం?” అని అన్నారు.