2014 ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతానని కెసిఆర్ హామీ ఇచ్చినందున రాష్ట్రంలో ముస్లింలు తెరాసకు ఓట్లు వేసి గెలిపించారని, కానీ నాలుగేళ్ళు గడిచిపోతున్నా ఇంతవరకు కెసిఆర్ తన హామీని నిలబెట్టుకోలేదని, కనుక తెరాసలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో సహా ముస్లిం నేతలు, కార్యకర్తలు అందరూ రాజీనామాలు చేయాలని హైదరాబాద్ హైదరాబాద్ నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ సోహైల్ విజ్ఞప్తి చేశారు. త్వరలో తాము ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో తెరాసలో ముస్లిం నేతలందరినీ స్వయంగా కలిసి తెరాసకు రాజీనామాలు చేయవలసిందిగా కోరుతామని అన్నారు.
రాజ్యాంగం ప్రకారం 50 శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి తమ ప్రభుత్వం వ్యతిరేకమని రాష్ట్ర భాజపా నేతలు ముందే చెప్పారు, మోడీ సర్కార్ కూడా అదే చెపుతోంది. ఈవిషయంలో మోడీ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందో ముఖ్యమంత్రి కెసిఆర్ తెలియకనే దాని కోసం శాసనసభలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారని అనుకోలేము. దానిని ఆమోదించబోమని కేంద్రం తేల్చి చెప్పినా తెరాస ఎంపిలు రోజూ దాని కోసం లోక్ సభలో ఆందోళన చేస్తున్నారు. ఎందుకు?
ఈవిషయంలో తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీలు మూడు ఏపిలో రాజకీయ పార్టీల మాదిరిగానే ద్వందవైఖరితో వ్యవహరిస్తున్నాయని చెప్పకతప్పదు. ఏపిలో తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకహోదా అంశంతో ఏవిధంగా రాజకీయ మైలేజి పొందాలని ప్రయత్నిస్తున్నాయో, ఈ ముస్లిం రిజర్వేషన్ల అంశంతో రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్, భాజపాలు కూడా రాజకీయ మైలేజీ కోసం ఆరాటపడుతున్నాయి.
ముస్లింలకు రిజర్వేషన్ల శాతం పెంచితే అది తమ గొప్పదనమేనని లేకుంటే దాని కోసం తాము పార్లమెంటులో ఎంతగా పోరాటం చేసినప్పటికీ కేంద్రం అంగీకరించలేదని, కనుక మళ్ళీ తమకే ఓటేసి గెలిపిస్తే ధర్డ్ ఫ్రంట్ తో దానిని సాధించి చూపిస్తామని ముస్లిం ప్రజలకు చెప్పుకొనే వెసులుబాటు తెరాసకు ఉంటుంది.
తెరాస ప్రతిపాదనను గట్టిగా అడ్డుకొన్నామని చెప్పుకొని హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది భాజపా.
ఈ బిల్లు ఎలాగూ ఆమోదింపబడే అవకాశం లేదు కనుక, తెరాస, భాజపాలు కలిసి ముస్లిం ప్రజలను వంచించాయని చెప్పుకొని వారిని మళ్ళీ తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ తాపత్రయం.
ఈవిధంగా మూడు ప్రధాన పార్టీలు ముస్లిం రిజర్వేషన్లు బిల్లును తమ రాజకీయ అస్త్రంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయే తప్ప దానిపై వాటికి చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోంది. ఒకవేళ తెరాసకు నిజంగానే చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ బిల్లును అది అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే డిల్లీకి పంపి అప్పటి నుంచే కేంద్రంతో పోరాడి ఉండేది. కానీ తాపీగా రెండున్నరేళ్ళు కాలక్షేపం చేసి అప్పుడు పంపి ఇప్పుడు పోరాడుతోంది. కనుక ప్రత్యేకహోదా ఏవిధంగా ఆ రాష్ట్రానికి, ప్రజలకంటే అక్కడి రాజకీయ పార్టీలకు ఎక్కువగా ఉపయోగపడుతోందో, అలాగే ఈ ముస్లిం రిజర్వేషన్లు బిల్లు కూడా రాష్ట్రంలో ముస్లిం ప్రజలకంటే రాజకీయ పార్టీలకే ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు.