ఆ ప్రశ్నకు కోదండరాం ఎందుకు జవాబు చెప్పలేదో?

March 24, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం త్వరలో రాజకీయ పార్టీ స్థాపించబోతున్న సందర్భంగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అయన చెప్పిన కొన్ని విషయాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. తన కొత్త పార్టీ వెనుక కాంగ్రెస్ ఉందనే ఆరోపణలపై స్పందిస్తూ  ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలతో కలిసి పనిచేశామే తప్ప ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి అనుబంధమూ, రహస్య అవగాహనా తమకు లేవని స్పష్టం చేశారు. తమ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనే ఆరోపణలను అయన గట్టిగా ఖండించారు. 

బిఎల్ఎఫ్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “నేనిప్పుడు ఒక పార్టీ పెట్టబోతూ దాని గురించి మాట్లాడటం సబబుకాదు.  సామాజిక మార్పు, సామాజిక న్యాయం కోసం పనిచేయాలి. అన్ని వర్గాలకు రాజకీయాలలో ప్రాతినిధ్యం కల్పించాలి,” అని అన్నారు. కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ధర్డ్ ఫ్రంట్ ఒక రాజకీయ స్టంట్, అది ప్రజల దృష్టి మళ్ళించడానికేనని అన్నారు. 

ధర్డ్ ఫ్రంట్ గురించి అంత నిష్కర్షగా తన అభిప్రాయం చెప్పిన కోదండరాం, బిఎల్ఎఫ్ గురించి కూడా అదేవిధంగా తన అభిప్రాయం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానం చెప్పడం ఆలోచింపజేస్తుంది. కోదండరాం కూడా సామాజిక న్యాయం కోసమే తెరాసకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, అదే ఆశయాలతో తన మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేస్తున్న బిఎల్ఎఫ్ లో భాగస్వామిగా చేరుతానని చెప్పవచ్చు. కానీ చెప్పలేకపోయారు! ఎందుకంటే, కాంగ్రెస్, తెరాస, భాజపాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు బిఎల్ఎఫ్ ఏర్పాటు చేయబడింది. కోదండరాం తన వెనుక కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పుకొంటున్నప్పటికీ ఉందని చెప్పడానికి ఇదే చిన్న నిదర్శనం. నిజంగా లేకపోయుంటే అయన కూడా బిఎల్ఎఫ్ లో చేరి ఉండేవారు కదా? 


Related Post