కేంద్రంపై వెంకయ్య అసహనానికి కారణం అదేనా?

March 24, 2018


img

ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కేంద్రప్రభుత్వం తీరుపై శుక్రవారం రాజ్యసభలో తీవ్ర అసహనం వ్యక్తం చేయడం విశేషం. “రెండు వారల క్రితం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి చూస్తున్నాను. రోజూ సభలో సభ్యులు ఆందోళన చేస్తూ సమావేశాలు జరుగకుండా అడ్డుకొంటున్నారు. ఆ కారణంగా అనేక ముఖ్యమైన అంశాలపై సభలో చర్చించలేకపోతున్నాము. రోజూ సభ ప్రారంభం కాగానే సభ్యులు వెల్ లోకి వచ్చి నినాదాలు చేస్తూ సభను అడ్డుకోమ్తున్నారు. ప్రతిపక్ష సభ్యులకు నచ్చజెప్పి సభను నడిపించడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితులలో ప్రతీరోజూ సభను వాయిదా వేయవలసి వస్తోంది. ఇది పెద్దలసభ. కనుక సభ్యులు అందరూ హుందాగా నడుచుకోవాలి. లేకపోతే ప్రజల ముందు మనమే చులకనవుతాము. గతంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు, కేంద్రప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడి సభను ఆర్డర్ లో పెట్టడానికి ప్రయత్నించేది. కానీ ఇప్పుడు అటువంటి ప్రయత్నాలు ఏవీ జరగడం లేదు. కనీసం ఇప్పటికైనా పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి చొరవ తీసుకొని ప్రతిపక్షాలతో మాట్లాడి సభను సజావుగా జరపడానికి కృషి చేయాలి. లేకుంటే ఈవిధంగా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించినా ప్రయోజనం ఉండదు,” అని అన్నారు. 

సభను ఆర్డర్ లో పెట్టలేకపోతునందుకు వెంకయ్యనాయుడు ఈవిధంగా కేంద్రప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన జీవితమంతా భాజపాకే ధారపోసిన అయనను ఉపరాష్ట్రపతిగా చేసి మోడీ సర్కార్ గౌరవించినట్లే పైకి కనిపిస్తుంది. కానీ ఆ పదవితో అయన చేతులు, కాళ్ళు కట్టేసింది కూడా. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అయన రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఏపికి అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తుండేవారు. అయనకు చంద్రబాబు నాయుడుకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. బహుశః ఆ కారణంగానే ఆయనను కేంద్రమంత్రి పదవిలో నుంచి తప్పించారనే గుసగుసలు వినిపించాయి. ఆయనను ఆ పదవిలో నుంచి తప్పించగానే మెల్లగా తెదేపా-భాజపా సంబంధాలు దెబ్బతినడం చివరికి భాజపాతో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని మోడీ సర్కార్ పై తెదేపా తిరుగుబాటు చేసే స్థాయికి చేరుకోవడం, ప్రశాంతంగా ఉండే ఏపిలో మళ్ళీ ఆందోళనలతో అట్టుడుకుతుండటం వంటి పరిణామాలన్నీ  వెంకయ్యనాయుడు జీర్ణించుకోలేనివే. ఏపిలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నా కేంద్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వెంకయ్యనాయుడు అసహనానికి అసలు కారణం బహుశః అదేనేమో?


Related Post