బడ్జెట్ సమావేశాలా...అవిశ్వాస సమావేశాలా?

March 23, 2018


img

పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరుసగా ఆరురోజులు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తెదేపా, వైకాపాలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాయి. లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా సభ ఆర్డర్ లో లేదనే కుంటిసాకుతో వాటిపై సభలో చర్చ జరుగకుండా మోడీ సర్కార్ తప్పించుకొంది. అయినప్పటికీ తెదేపా, వైకాపాలు పట్టు వదలని విక్రమార్కుడిలాగ రోజూ అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇస్తూనే ఉన్నాయి. తాజాగా వాటికి కాంగ్రెస్ పార్టీ కూడా జత కలిసింది. అది కూడా మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కోరుతూ శుక్రవారం నోటీస్ ఇచ్చింది. ఈనెల 27వ తేదీన లోక్ సభలో దానిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపి మల్లికార్జున ఖర్గే లోక్ సభ సెక్రెటరీ జనరల్ కు ఈరోజు నోటీస్ అందజేసింది. 

ఈ సందర్భంగా మాజీ ఎంపి జెడి శీలం మీడియాతో మాట్లాడుతూ, “మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఇన్నిసార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కోలేకపోతోంది. మోడీ సర్కార్ కు పార్లమెంటరీ విధానాలపట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం లేదు. అందుకే వాటిని సభలో చర్చకు రానివ్వకుండా అడ్డుకొంటున్నారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేని అటువంటి ప్రభుత్వం మనకు అక్కరలేదు. అందుకే మేము కూడా అవిశ్వాస తీర్మానం కొరకు నోటీసు ఇచ్చాము,” అని అన్నారు. 

అయితే తెదేపా, వైకాపాల తీర్మానాలనే ఎదుర్కోకుండా తప్పించుకొంటునప్పుడు, వాటికంటే బలమైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తీర్మానంపై సభలో చర్చకు సిద్దపడుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. అనుమతిస్తే, యూపియే మిత్రపక్షాలు, భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీలు అన్నీ కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకడం ఖాయం. అయినప్పటికీ దానితో మోడీ సర్కార్ కూలిపోదు కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటువంటి పరిణామాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దానిని ఆయుధంగా ఉపయోగించుకొనే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని కూడా చర్చకు రాకుండా అడ్డుకోవడం ఖాయమేనని చెప్పవచ్చు. వరుసగా ప్రవేశ పెడుతున్న ఈ అవిశ్వాస తీర్మానాల కారణంగా అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ముగిసిపోనున్నాయి. 


Related Post