ఆ ఏడుగురి ఓట్లు రద్దు చేయండి: కాంగ్రెస్

March 23, 2018


img

కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఇవ్వాళ్ళ జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో తెరాస అభ్యర్ధులకు ఓటేశారు. ఈ ఎన్నికలలో పాల్గొనే ఎమ్మెల్యేలు వారి పార్టీల పోలింగ్ ఏజంట్లకు తాము ఎవరికి ఓటు వేయబోతున్నామో ముందే తెలియజేయాలని ఈసి నిబంధన విధించడంతో ఆ ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాము తెరాస అభ్యర్ధికి ఓటు వేయబోతున్నట్లు కాంగ్రెస్ పోలింగ్ ఏజంటుకు తెలియజేసి ఓట్లు వేశారు. దాని ఆధారంగా టి-కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమీషన్ కు వారిపై పిర్యాదు చేశారు. ఆ ఏడుగురి ఓట్లు పరిగణనలోకి తీసుకోకూడదని, పార్టీ విప్ ను ధిక్కరించి తెరాస అభ్యర్ధికి ఓటు వేసినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 

కొన్ని నెలల క్రితం గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదేవిధంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడినప్పుడు, ఎన్నికల కమీషన్ వారిపై అనర్హత వేటు వేసిందని, కనుక ఇప్పుడూ అదేవిధంగా తెరాస ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పిర్యాదు మేరకు ఈసి తెరాస ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, అత్యాశకు పోయినందుకు తెరాస చింతించవలసివస్తుంది.   



Related Post