ఫ్రంట్ ఏర్పాటుపై సిపిఎం నేత స్పందన

March 23, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను దేశంలో అన్ని పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. సిపిఎం జాతీయ నేత ప్రకాష్ కారత్ స్పందిస్తూ, “అది అంత సులువైన పనేమీ కాదు. ఒక్కో రాష్ట్రంలో అనేక ప్రాంతీయపార్టీలు ఉంటాయి. వాటికి తమ అవసరాలు, ప్రయోజనాల కంటే ఏదీ ముఖ్యం కాదు. వాటికి అనుగుణంగానే వాటి ప్రాధాన్యతలు, వ్యూహాలు కూడా ఉంటాయి. కనుక వాటన్నిటినీ ఒకే గొడుగు క్రిందకు తీసుకురావడం చాలా కష్టం. ఒకవేళ వాటినన్ని కూడగట్టి భాజపాను ఓడించాలనుకొంటే అంతకంటే ముందుగా ఆయా రాష్ట్రాలలో భాజపా వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూడటం చాలా అవసరం. అది కూడా చాలా కష్టమైనా పనే. కనుక ఫ్రంట్ ఏర్పాటు చేయడం కెసిఆర్ అనుకొన్నంత సులువు కాదు,” అని అన్నారు. 

ప్రకాశ కారత్ చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఉదాహరణకు పొరుగునే ఉన్న ఏపిలో తెదేపా, వైకాపాలు రెండూ బద్ధ శత్రువులు. ఆధిపత్యపోరులో కత్తులు దూసుకొంటున్నాయి. ఒకవేళ వాటిలో ఒక పార్టీని ఫ్రంట్ లో భాగస్వామిగా చేయాలనుకొంటే, దాని గొంతెమ్మ కోర్కెలన్నీ తీర్చడానికి అంగీకరించాలి. అదే జమ్ము కాశ్మీర్ లో పార్టీలను కలుపుకోవాలంటే పాకిస్తాన్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తామని హామీ ఇవ్వాలి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కావేరీ జలాల సమస్య ఉంది. ఈవిధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన రాజకీయ వాతావరణం, ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి. అవేమీ చర్చించకుండా భాజపా, కాంగ్రెస్ పార్టీలను ఓడించడానికి అందరూ చేతులు కలపడానికి రమ్మంటే వచ్చే అవకాశాలు తక్కువ. వచ్చినా..వాటి మద్య ఆధిపత్య పోరు తప్పదు. 

ఇక ప్రకాష్ కారత్ చెప్పిన దానిలో భాజపా వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుందనే హెచ్చరిక ఉంది. కానీ భాజపా వ్యతిరేక ఓట్లు చీల్చడానికే కెసిఆర్ హటాత్తుగా ఈ ధర్డ్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కనుక కెసిఆర్ ఏ ఉద్దేశ్యంతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారో దాని భవిష్యత్ ఎలా ఉంటుందో రానున్న రోజులలో తెలుస్తుంది.

కెసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు సాధిస్తానని చెపుతుంటే, సిపిఎం నేతృత్వంలో ఏర్పాటైన బిఎల్ఎఫ్ తెరాసను ఓడించి రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు సాధిస్తామని చెపుతోంది. బహుశః అది సాధ్యం కాకపోవచ్చు కానీ రాష్ట్రంలో తెరాస పాలనను వ్యతిరేకిస్తున్నవారు కూడా ఉన్నారని బిఎల్ఎఫ్ ఏర్పాటు నిరూపిస్తోంది. 


Related Post