నాగం రాజీనామాపై లక్ష్మణ్ స్పందన

March 23, 2018


img

నాగం జనార్ధన్ రెడ్డి భాజపాను వీడటంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. అయన హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నాగం జనార్ధన్ రెడ్డి తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారు. అవినీతికి వ్యతిరేకంగా అయన చేస్తున్న పోరాటానికి మేము సహకరించలేదనే ఆరోపణలు ఖండిస్తున్నాము. తెరాస సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు వేసిన కమిటీకి అయననే అధ్యక్షుడుగా నియమించాము. కానీ అయన ఎందుకు పోరాడలేకపోయారో ఆయనకే తెలియాలి. ఇక మా పార్టీ విధానాలకు భిన్నంగా 2014 ఎన్నికలలో ఆయనకు, అయన కుమారుడికి కూడా పార్టీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాము. కానీ వారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయారు. నాగం జనార్ధన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవించినప్పటికీ, అయన పార్టీపై నిందలు వేసి వెళ్ళిపోవడం బాధాకరం. అయితే అయన బయటకు వెళ్ళిపోయినంత మాత్రాన్న పార్టీకి ఎటువంటి నష్టమూ ఉండదు. తెరాస సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగిస్తాము. వచ్చే ఎన్నికలలో మా సత్తా నిరూపించుకొంటాము,” అని చెప్పారు. 

నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయడానికి ఎంచుకొన్న సమయం, అందుకు అయన చెప్పిన కారణం రెండూ కూడా భాజపాకు ఇబ్బంది కలిగించేవే. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తెదేపా, వైకాపాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా తెరాస ఎంపిలు అడ్డుకొంటూ, మోడీ సర్కార్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, కెసిఆర్-మోడీల మద్య రహస్య అవగాహన ఉన్నందునే తెరాస ఎంపిలు ఆవిధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సమయంలో, నాగం జనార్ధన్ రెడ్డి కూడా భాజపాపై అటువంటి ఆరోపనలే చేస్తూ రాజీనామా చేయడం భాజపాకు ఇబ్బందికరమే.


Related Post