వచ్చే ఎన్నికలలో నల్గొండ నుంచి కెసిఆర్ పోటీ?

March 22, 2018


img

తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఉపఎన్నికలను కూడా ఎదుర్కోవడానికి భయపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇక సార్వత్రిక ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోగలదు? ఉపఎన్నికలను ఎదుకొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ నేతలు న్యాయస్థానాన్ని, ఈసిని ఆశ్రయించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పతనం ఎప్పుడో మొదలైంది. అయన చేసేవన్నీ దొంగ దీక్షలు, కపట నాటకాలే. ఆయనను జిల్లా ప్రజలు కూడా నమ్మడం లేదు. ఉపఎన్నికలు ఎప్పుడు వచ్చినా భూపాల్ రెడ్డి తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తారు. అయన చేతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈసారి పరాభవం తప్పదు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ నేతలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో సహా ఒక్కరు కూడా గెలిచే అవకాశాలు లేవు. వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి కెసిఆర్ నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి,” అని అన్నారు.

రాష్ట్రంలో నేటికీ నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలబడి ఉంది. కనుక ఆ కంచుకోటను బద్దలు కొడితే కాంగ్రెస్ కుప్పకూలిపోతుందని తెరాస భావిస్తోంది. ఇంతకాలం గుత్తా సుఖేందర్ రెడ్డి చేత రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి బారీ మెజార్టీతో గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి తమ సత్తా చూపాలని తెరాస అధిష్టానం భావించింది. కానీ ఊహించని విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డే స్వయంగా తెరాసకు ఆ అవకాశం కల్పించారు. కనుక ఉపఎన్నికల కోసం కాంగ్రెస్ కంటే తెరాసయే ఇప్పుడు ఆత్రంగా ఎదురుచూస్తోంది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ హైకోర్టులో వేసిన పిటిషన్లపై విచారణ పూర్తయ్యేవరకు ఉపఎన్నికలు జరిగే అవకాశం లేదు. 

కాంగ్రెస్ కంచుకోటను దెబ్బ తీయాలని కెసిఆర్ భావిస్తున్నారు కనుక అయన నల్గొండ నుంచి పోటీ చేస్తారనే వేముల వీరేశం మాటలు నిజమేనని భావించవచ్చు. 


Related Post