జానా, ఉత్తం కూడా ఓడిపోతారుట!

March 22, 2018


img

రాబోయే ఎన్నికలలో తెరాస 106 సీట్లు గెలుచుకొంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అవకాశం చిక్కినప్పుడల్లా గట్టిగా చెపుతూనే ఉంటారు. యధారాజా..తధాప్రజా అన్నట్లుగా తెరాస నేతలందరూ కూడా అదే పాట కోరస్ పాడుతున్నారు. వచ్చే ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ తెరాస అభ్యర్ధుల చేతిలో ఓడిపోవడం ఖాయమని తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇటువంటి మాటలు కెసిఆర్ వంటి సీనియర్ నేతలు మాట్లాడితే వాటికి ఏమైనా విలువుంటుంది. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే చెప్పడం అతిశయోక్తిగా ఉంది.       

తెరాస పాలనలో రాష్ట్రాభివృద్ధి జరిగిన మాట వాస్తవం. అనేక సంక్షేమ పధకాలు అమలవుతున్న మాట కూడా వాస్తవమే. అయితే రాష్ట్రంలో అనేక సమస్యలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల గురించి జోస్యం చెప్పేటప్పుడు వాస్తవ రాజకీయ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని చూడాలి. అలా చూస్తే తెరాస అన్ని సీట్లు సాధించడం అసాధ్యం అని అర్ధమవుతుంది. 

“వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని, కెసిఆర్ కుటుంబం కూడా అందుకు సిద్దమేనా?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు తెరాసకు సవాలు విసిరారు. అది వారి ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది. కెసిఆర్ చెప్పుకొంటున్నట్లుగా వారు కూడా 106 సీట్లు గెలుచుకొంటామని చెప్పుకోవడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను మాత్రం తప్పకుండా గెలుచుకొంటామని గట్టిగా చెపుతున్నారు. కనుక వారు తెరాసకు చాలా గట్టిపోటీ ఇవ్వబోతున్నారని స్పష్టం అవుతోంది. 

ఇక బిఎల్ఎఫ్, ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేయబోతున్న తెలంగాణా జన సమితి (టిజెఎస్), భాజపా, స్వతంత్ర అభ్యర్ధులు, తెరాస టికెట్ లభించక తిరుగుబాటు చేసే అభ్యర్ధులు ఉండనే ఉంటారు. కనుక వారందరూ కూడా ఓట్లను చీల్చడం ఖాయం. ఎన్నికల సమయంలో ఏదైనా జరుగవచ్చు. అది ఏ పార్టీకైనా లబ్ది కలిగించవచ్చు. ఈ వాస్తవాలన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా తెరాస 106 సీట్లు గెలుచుకొంటుందని గొప్పలు చెప్పుకోవడం అతిశయోక్తిగానే ఉంటుంది. 


Related Post