సారీ యూజర్స్: జుకర్ బర్గ్

March 22, 2018


img

అమెరికాలో మొదలైన ‘ఫేస్ బుక్’ తుఫాను భారత్ ను కూడా తాకింది. ఫేస్ బుక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను బ్రిటన్ కు చెందిన స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ లాబొరేటరీస్‌ (ఎస్‌సీఎల్‌) చేతికి అప్పగించగా దాని అనుబంధ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికా (సీఏ) అనే సంస్థ, ఆ వివరాల ఆధారంగా రాజకీయ పార్టీలకు తగిన వ్యూహాలను సిద్దం చేసి ఇస్తోందనే విషయం బహిర్గతం అవడంతో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ కు అమెరికా ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ తాజా వివాదంపై జుకర్ బర్గ్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన నేరం కాదని అయినా ఈ పొరపాటుకు ఫేస్ బుక్ వినియోగ దారులందరినీ క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు మరొకరి చేతిలో పడకుండా గోప్యత పాటించవలసిన బాధ్యత ఖచ్చితంగా తమపైనే ఉందని కానీ కొన్ని తప్పిదాల కారణంగా ఆ వివరాలు బయటి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయని అంగీకరించారు. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన తమకు ఒక గుణపాఠం వంటిదని, దీని నుంచి పాఠాలు నేర్చుకొని మళ్ళీ ఇటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని తెలిపారు.

ఇప్పుడు ఈ వివాదం కాంగ్రెస్, భాజపాలకు కూడా ఒక అస్త్రంగా మారింది. 2014 ఎన్నికల మొదలు నేటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో భాజపా కూడా ఈ ‘డాటా అనలిటిక్స్’ సేవలను ఉపయోగించుకొనే విజయం సాధిస్తోందని కాంగ్రెస్ వాదించడం మొదలుపెట్టింది. 2019 ఎన్నికలలో భాజపా 272 పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో అమిత్ షా ప్రకటించిన ‘మిషన్ 272 ప్లస్’ వెనుక ఈ ‘డాటా అనలిటిక్స్’ ప్రధాన పాత్ర పోషించబోతోందని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం ఇన్-ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. దాని కోసం భాజపా కేంబ్రిడ్జ్‌ అనలిటికాతో సంబంధాలున్న భారతీయ సంస్థ ఒవెలినా బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఓబీఐ) సంస్థతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొందని ఆరోపించారు. 2009లోనే రాజ్ నాథ్ సింగ్ ఆ సంస్థ సేవలను ఉపయోగించుకొన్నారని సుర్జేవాలా ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలను భాజపా ఐటీసెల్‌ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయ ఖండించారు. 

భాజపా కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ పై విరుచుకు పడుతోంది. రాహుల్ గాంధీని ప్రమోట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీయే కేంబ్రిడ్జ్‌ అనలిటికా (సీఏ) సేవలను ఉపయోగించుకొంటోందని, 2019 ఎన్నికల కోసం అది ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకొందని భాజపా వాదిస్తోంది. 

ఈ వ్యవహారంపై కేంద్ర ఐటి మరియు ప్రసారశాఖ మంత్రి రవి శంఖర్ ప్రసాద్ స్పందిస్తూ, “మా ప్రభుత్వం ప్రజల భావప్రకటన స్వేచ్చకు, పత్రికా స్వేచ్చకు పూర్తి మద్దతు ఇస్తుంది. అయితే ఆ ముసుగులో ఫేస్ బుక్ సంస్థ, భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లయితే జూకర్ బర్గ్ ను విడిచిపెట్టబోము. ఆయనను కోర్టుకీడ్చి చట్టప్రకారం శిక్షించడానికి వెనుకాడబోము,” అని హెచ్చరించారు. 


Related Post