మోడీని విమర్శించే ధైర్యం ఎవరికైనా ఉందా?

March 22, 2018


img

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలలో వైజాగ్ మాజీ మేయర్ సబ్బంహరి కూడా ఒకరు. రాజకీయ విశ్లేషణలో ఆయనకు మంచి పేరుంది. భాజపాతో తెదేపా తెగతెంపులు, ప్రత్యేకహోదా డిమాండ్, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాలు, వాటిపై తెదేపా, తెరాస, వైకాపా, భాజపాల వైఖరి మొదలైన అంశాలపై చాలా సునిశితంగా విశ్లేషించారు.

ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలలో తమ జెండాలను ఎగురవేసిన భాజపా దక్షిణాది రాష్ట్రాలను కూడా కబళించడానికి భేదోపాయంతో తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చంద్రబాబు గ్రహించినందునే, భాజపాకు చెక్ పెట్టేందుకు    సరిగ్గా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దానితో తెగతెంపులు చేసుకొన్నారని, అది చాలా తెలివైన వ్యూహమని, తద్వారా రాష్ట్ర రాజకీయాలలో పైచెయ్యి సాధించగలిగారని అన్నారు. కానీ ఈ వేడిని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించగలరో లేదో చూడాలని అన్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతోనే మోడీ సర్కార్ తో దోస్తీకి ప్రయత్నిస్తున్నారని, కానీ మతతత్వ భాజపాతో చేతులు కలిపితే ఇంకా ఎక్కువ నష్టపోతామేమోననే భయం చేతే కాస్త వెనకడుతున్నారన్నారు. అయితే ఆ కేసుల   కారణంగానే రాష్ట్ర ప్రజలు వైకాపాను గెలిపించడానికి ఇష్టపడకపోవచ్చని అన్నారు. ఒకవేళ వైకాపా, భాజపాలు జత కడితే రెండూ నష్టపోవడం ఖాయమని సబ్బం హరి అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కెసిఆర్ తదితరులు అందరూ మోడీ పట్ల తమకు విశ్వాసం ఉంది కానీ అయన ప్రభుత్వంపై లేదని చెప్పడాన్ని సబ్బం హరి ఆక్షేపించారు. మోడీని విమర్శిస్తే ఎటువంటి విపరీత పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందో వారందరికీ తెలుసు కనుకనే ఎవరూ మోడీని నేరుగా పేరు పెట్టి విమర్శించడం లేదని అన్నారు. ఒకవేళ వారు నిజంగా మోడీని వ్యతిరేకిస్తున్నట్లయితే, మోడీని పేరు పెట్టి విమర్శించాలని సవాలు విసిరారు. 


Related Post