కెసిఆర్ ప్రయత్నాలు ఫలించేనా?

March 21, 2018


img

కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటున్నారు. అయితే అంతకంటే ముందుగా అయన తన చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవలసి ఉంటుంది. 

అయన కాంగ్రెస్ పార్టీపై నిర్మొహమాటంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ దేశానికి, తెలంగాణా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చీడపురుగు వంటిదని చాలా తీవ్రమైన పదాలతో విమర్శిస్తుంటారు. కానీ భాజపా, మోడీ సర్కార్ విషయానికి వచ్చే సరికి అయన మాటలలో ఆ పదును, వేడి కనిపించదు. మోడీ సర్కార్ తెలంగాణాకు అన్యాయం చేస్తోందనే విమర్శతో సరిపెడుతుంటారు. ఇక అయన నిజంగా మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తున్నట్లయితే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాలను అడ్డుకొనేబదులు వాటిని సభలో చర్చకు వచ్చేందుకు సహకరించేవారు. మోడీతో రహస్య అవగాహనా ఉన్నందునే, అవిశ్వాస తీర్మానాలకు తెరాస ఎంపిల చేత అడ్డుకొంటున్నారనే కాంగ్రెస్ విమర్శలకు తెరాస సంతృప్తికరమైన జవాబు చెప్పలేకపోతోంది. కనుక తాను నిజంగానే భాజపాను, మోడీ సర్కార్ ను వ్యతిరేకిస్తున్నానని, వాటిని ఎదుర్కొనేందుకు భయపడబోననే నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. లేకుంటే అయనతో చేతులు కలిపేందుకు ఎవరూ ముందుకు రాకపోవచ్చు. 

ఇక వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా...రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ కు చాలా కీలకం. కనుక, కాంగ్రెస్ పార్టీ కూడా భాజపా వ్యతిరేక పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ రాజకీయాలలో మంచి పలుకుబడి ఉన్న మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ ప్రస్తుతం అదే పనిమీద ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీల నేతలందరినీ ఈనెల 27న డిల్లీలో తన నివాసంలో సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఆ సమావేశానికి హాజరు కాబోయేవారిలో కెసిఆర్ కలిసివచ్చిన మమతా బెనర్జీ కూడా ఉన్నారు. ఇంకా కెసిఆర్ కలవాలనుకొంటున్న నేతలు కూడా ఉండవచ్చు. ఒకవేళ వారు ఆ సమావేశానికి హాజరయ్యి కాంగ్రెస్ నేతృత్వంలో భాజపాతో పోరాడాలని నిర్ణయించుకొంటే అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ లో చేరేవారే ఉండరు. ఇక కాంగ్రెస్, భాజపాలకు సమాన దూరం పాటించే పార్టీలు కూడా ఉన్నాయి. కానీ అటువంటివి వ్రేళ్ళమీద లెక్కించవచ్చు. 

కనుక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి ఆలోచించే ముందు కెసిఆర్ ఈ రెండు సమస్యలను అధిగమించవలసి ఉంటుంది. మొదటిది తన చేతిలోనే ఉంది. కాంగ్రెస్ ను ఏవిధంగా వ్యతిరేకిస్తున్నానో నరేంద్ర మోడీని కూడా అదే విధంగా వ్యతిరేకిస్తున్నాననే నమ్మకం కలిగించాల్సి ఉంది. రెండవది ఇతరపార్టీల రాజకీయ అవసరాలు, స్వార్ధ ప్రయోజనాలు, విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కనుక కెసిఆర్ తన ప్రయత్నాలు తను చేసుకుపోక తప్పదు. 


Related Post