తెరాసకు పొన్నం కౌంటర్

March 21, 2018


img

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏపి ఎంపిలు పెట్టిన అవిశ్వాస తీర్మానాలు తెరాసకు అగ్నిపరీక్షగా మారడం విశేషం. మొదట అవి ‘పిల్లచేష్ట’లన్నారు. తరువాత వాటికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. మళ్ళీ యూ టర్న్ తీసుకొని ‘పక్కింట్లో పెళ్ళయితే మనింట్లో రంగులు వేసుకొంటామా? అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముందు మమల్ని సంప్రదించారా..లేదు కదా?’అంటూ తెరాస ఎంపిలు సన్నాయి నొక్కులు నొక్కారు. 

అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే విషయంలో తెరాస వేస్తున్న ఈ కుప్పిగంతులను చూసి కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “భాజపా-తెరాసల మద్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని చెప్పడానికి లోక్ సభలో తెరాస ఎంపిల తీరే నిదర్శనం. ఆరు దశాబ్దాలపాటు మనతో కలిసి ఉన్న మన పొరుగు తెలుగు రాష్ట్రమైన ఏపి విభజన హామీలపై మోడీ సర్కార్ తో పోరాడుతుంటే దానికి సహకరించకుండా తెరాస నాటకాలు ఆడుతోంది. అసలు కెసిఆర్ చేయవలసిన పనిని ఏపి ఎంపిలు చేస్తున్నప్పుడు వారికి ఎందుకు సహకరించడం లేదు? పొరుగింట్లో పెళ్ళవుతుంటే మనింట్లో రంగులు వేసుకొంటామా? అని తెరాస ఎంపి అడిగారు. మరి పొరుగింట్లో శవం ఉంటే మనింట్లో పండగ చేసుకొంటామా? కెసిఆర్ మోడీకి భయపడే అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఈయడం లేదు. దీనితో తెరాస, భాజపాల మద్య ఉన్న రహస్య బంధం బట్టబయలైంది,” అని విమర్శించారు.



Related Post